Atal Pension Yojana: అటల్‌ పెన్షన్‌ యోజనపై కాంగ్రెస్‌ విమర్శలు.. తిప్పికొట్టిన భాజపా

అటల్‌ పెన్షన్‌ యోజన పథకంపై కాంగ్రెస్‌, భాజపా మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ పథకం లబ్ధిదారులకు చేరడం లేదంటూ కాంగ్రెస్‌ పార్టీ చేసిన విమర్శలను భాజపా తిప్పికొట్టింది.

Published : 26 Mar 2024 17:47 IST

Atal Pension Yojana | దిల్లీ: కేంద్రంలోని అధికార భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న అటల్‌ పెన్షన్‌ యోజనపై (Atal Pension Yojana) ఇరు పార్టీల మధ్య వివాదం నెలకొంది. ఈ పథకాన్ని డిజైన్‌ చేయడంలో కేంద్రం విఫలమైందంటూ కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వాటిని కొట్టిపారేశారు. పేదలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతోందని పేర్కొన్నారు. ఇంతకీ వివాదం ఎక్కడ మొదలైందంటే?

అసంఘటిత కార్మికులకు ఉద్దేశించిన అటల్‌ పెన్షన్‌ యోజన పథకంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శలు గుప్పించారు. పథకం ప్రచారంలోనే తప్ప.. వాస్తవంలో లబ్ధిదారులకు చేరడం లేదని పేర్కొన్నారు. ప్రతి ముగ్గురిలో ఒక చందాదారుడు పథకం నుంచి వైదొలుగుతున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాన్ని జత చేస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ఇచ్చిన టార్గెట్‌లను పూర్తి చేయడానికి చాలా మంది బ్యాంక్‌ ఉద్యోగులు చందాదారుల అనుమతి తీసుకోలేదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ రీసెర్చ్‌ సర్వేలో తేలినట్లు ఆ కథనం వెల్లడించింది. 83 శాతం మంది వెయ్యి రూపాయల పెన్షన్‌ శ్లాబులో ఉన్నారని, లబ్ధిదారులకు తెలీకుండా ఖాతాలు తెరవడమే అందుక్కారణమని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ఇచ్చే పెన్షన్‌ ఏ మూలకూ రాదని, స్కీమ్‌ను సరిగా డిజైన్‌ చేయలేదంటూ విమర్శించారు.

టిక్‌టాక్‌పై నిషేధం ముప్పు.. అమెరికాలో బైట్‌ డ్యాన్స్‌ ‘కొత్త’ ప్లాన్‌!

దీనిపై తాజాగా నిర్మలా సీతారామన్‌ స్పందించారు. జైరాం రమేశ్‌ వాస్తవాలను విస్మరించారని చెప్పారు. ఏపీవై కింద చందాదారులకు కనీసం 8 శాతం ప్రతిఫలం అందేలా ప్రభుత్వ హామీ ఉందని గుర్తు చేశారు. అలాగే హామీ మొత్తాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ఆర్‌డీఏకు రాయితీ మొత్తాన్ని చెల్లిస్తోందన్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశమే పేదలకు, స్వల్ప ఆదాయ వర్గాలకు పెన్షన్‌ అందించడమని, అందుకే మెజారిటీ చందారులు తక్కువ శ్లాబు పరిధిలో ఉన్నారని పేర్కొన్నారు. పేదలకు పెన్షన్‌ కూడా అందకుండా చేయాలనేది కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశమంటూ నిర్మలా సీతారామన్‌ దుయ్యబట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు