టిక్‌టాక్‌పై నిషేధం ముప్పు.. అమెరికాలో బైట్‌ డ్యాన్స్‌ ‘కొత్త’ ప్లాన్‌!

టిక్‌టాక్‌పై నిషేధం ముప్పు పొంచి ఉన్న వేళ.. దాని మాతృ సంస్థ బైట్‌ డ్యాన్స్‌ కొత్త స్కెచ్‌ వేసింది. కొత్త యాప్‌ను విపరీతంగా ప్రమోట్‌ చేస్తోంది.

Published : 26 Mar 2024 14:20 IST

ByteDance | ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌పై నిషేధం ముప్పు పొంచి ఉన్న వేళ.. దాని మాతృ సంస్థ బైట్‌ డ్యాన్స్‌ (ByteDance) ‘కొత్త’ స్కెచ్‌ వేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ ఫీచర్లు కలిగిన కొత్త యాప్‌ను అమెరికాలో పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేస్తోంది. ఇందుకోసం టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లకు భారీగానే ముట్టచెబుతోందని అక్కడి మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

2017లో ప్రారంభమైన టిక్‌టాక్‌ను భారత్‌ సహా అనేక దేశాలు నిషేధించాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలూ దీని వినియోగంపై ఆంక్షలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. చైనా యాజమాన్యాన్ని వదలుకోకపోతే నిషేధం ఎదుర్కోవాల్సిందేనది బిల్లులోని సారాంశం. అదే జరిగితే టిక్‌టాక్‌కు గట్టి దెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు.

కొత్త యాప్‌తో ముందుకు..

ఇన్‌స్టా ఫీచర్లు కలిగిన ‘లెమన్‌ 8’ యాప్‌ డౌన్‌లోడ్లను పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. లెమన్‌ 8ను టిక్‌టాక్‌ వేదికగా ప్రమోట్‌ చేస్తే 200 డాలర్లు ఇస్తామని బైట్‌డ్యాన్స్‌ ఆశ చూపిందని ఓ ఇన్‌ఫ్లూయెన్సర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు లెమన్‌ 8 కోసం పనిచేస్తున్నారు. యాప్‌ను ప్రమోట్ చేస్తూ వీడియోలు రూపొందిస్తున్నారు. పక్కనే యాప్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇస్తున్నారు. గడిచిన ఏడాదిగా ఈ యాప్‌ను విపరీతంగా ప్రమోట్‌ చేస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఫీచర్లు ఇవే..

లెమన్‌ 8 యాప్‌.. అచ్చం ఇన్‌స్టాను పోలి ఉంటుంది. ఇదో ఫొటో బేస్డ్ యాప్‌. ఇందులో యూజర్లు ఫ్యాషన్‌, ఫుడ్‌, బ్యూటీ, ఆరోగ్యం, ట్రావెల్‌కు సంబంధించిన అంశాలను ఇమేజ్‌ రూపంలో పోస్ట్‌ చేయొచ్చు. ఇతరులు పోస్ట్‌ చేసిన వాటిని సేవ్‌/ షేర్‌ చేసుకోవచ్చు. ఇతరులు పెట్టిన పోస్టులు నచ్చితే వారిని ఫాలో అవ్వొచ్చు. 2020లో జపాన్‌లో తొలిసారి ఈ యాప్‌ను లాంచ్‌ చేశారు. తర్వాత వియత్నాం, మలేషియా, థాయ్‌లాండ్‌, సింగ్‌పూర్‌కు విస్తరించారు. గతేడాది ఫిబ్రవరిలో అమెరికాకు తీసుకొచ్చారు. ప్రస్తుతం 40 లక్షలకు పైగా యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని