AAP: ‘కేజ్రీవాల్‌ హత్యకు కుట్ర’.. ఆప్‌ తీవ్ర ఆరోపణలు

బెయిల్‌ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించడంపై ఆప్‌ స్పందించింది. ఆయనను చంపేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది. 

Published : 18 Apr 2024 21:29 IST

దిల్లీ: ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి, అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఆరోగ్యంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టు ఎదుట చేసిన ఆరోపణలపై స్పందించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) అగ్గిమీద గుగ్గిలమైంది. ఆరోగ్య కారణాలు చూపి బెయిల్‌ పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఈడీ పేర్కొనడంపై మండిపడింది. కేజ్రీవాల్‌ను చంపేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది.

‘‘తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈడీ ద్వారా కేంద్రంలోని భాజపా కేజ్రీవాల్‌ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు యత్నిస్తోంది. జైల్లో ఉన్న ఆయనకు ఇంటినుంచి వచ్చే భోజనం అందకుండా చేసేందుకు ఈ నాటకమాడుతోంది. ఆయన మామిడి పండ్లు, స్వీట్లు తీసుకుంటున్నారని ఈడీ న్యాయస్థానంలో చెప్పిందంతా అబద్ధం. కేజ్రీవాల్‌ కేవలం కృత్రిమ తీపి పదార్థం తీసుకుంటున్నారు’’ అని మీడియా సమావేశంలో దిల్లీ మంత్రి ఆతిశీ మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.

బెయిల్‌ కోసం.. కేజ్రీవాల్‌ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ

‘‘శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోవడం అత్యంత ప్రమాదకరం. అందుకే మధుమేహం ఉన్న వ్యక్తులు అరటిపండు లేదా చాక్లెట్‌ వంటి ఏదైనా తీపి పదార్థం వెంట ఉంచుకోవాలని ఏ వైద్యుడైనా చెబుతారు. కేజ్రీవాల్‌ ఆలూ- పూరీ తింటున్నారని ఈడీ అంటోంది. ఆయన కేవలం నవరాత్రుల ప్రారంభ రోజున మాత్రం పూరీ తిన్నారు. భాజపా కుట్రలో భాగంగా కేజ్రీవాల్‌కు ఇంటి భోజనం అందకుండా చేసి ఆయనను చంపేందుకు ఈడీ అసత్య ప్రచారం చేస్తోంది. ఒకవేళ ఇంటి భోజనం అందకపోతే జైల్లో ఆయనకు ఎలాంటి ఆహారాన్ని అందిస్తారో తెలియదు. గత కొద్దికాలంగా కేజ్రీవాల్‌ చక్కెర స్థాయిలు 300 mg/dl కంటే ఎక్కువగా ఉన్నాయి. కానీ, జైలు అధికారులు ఆయన ఇన్సూలిన్‌ తీసుకునేందుకు నిరాకరించారు’’ అని ఆతిశీ ఆరోపించారు.

చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్‌ డాక్టర్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ కేజ్రీవాల్‌ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న వేళ.. ఈడీ ఆరోపణలు చేసింది. తాజగా దీనిపై స్పందించిన దిల్లీ మంత్రి ఆతిశీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని