MP murder: దొరకని శరీర భాగాలు.. మిస్టరీగానే బంగ్లా ఎంపీ మృతి ఘటన!

ñబంగ్లాదేశ్‌ ఎంపీ హత్యను నిర్ధరించుకునేందుకు అపార్టుమెంటులో గుర్తించిన రక్తపు నమూనాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించడం ఒక్కటే మార్గమని పోలీసులు పేర్కొన్నారు.

Published : 28 May 2024 19:20 IST

కోల్‌కతా: బంగ్లాదేశ్‌కు చెందిన ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ (53) కోల్‌కతా శివారులో హత్యకు గురికావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఆయన శరీర భాగాలను గుర్తించడం కష్టంగా మారింది. చిన్న ముక్కలుగా చేసి పడేయడం, ఇటీవల వర్షాలకు అవి కొట్టుకుపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో ఎంపీ హత్యను నిర్ధరించుకునేందుకు అపార్టుమెంటులో గుర్తించిన రక్తపు నమూనాల సాయంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

‘‘శరీర భాగాలు లభించకుంటే, అక్కడున్న రక్తపు నమూనాలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తాం. వాటిని ఆయన కుటుంబీకుల డీఎన్‌ఐతో పోల్చి చూస్తాం. అదొక్కటే చివరి ఆప్షన్‌’’ అని బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యుల దర్యాప్తు బృందం వెల్లడించింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో శరీర భాగాల కోసం ప్రత్యేక బృందాలతో కాలువలో వెతికే ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టామని అన్నారు.

మంచుకొండల్లో మృత్యు ఘంటికలు.. ఎవరెస్టులో 8కి చేరిన మరణాలు!

కోల్‌కతా శివారులోని న్యూ టౌన్‌లోని ఓ అపార్టుమెంటులో అనర్‌ హత్యకు గురైనట్లు దర్యాప్తు చేస్తున్న కోల్‌కతా సీఐడీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఆయన శరీర భాగాలను ఇంకా గుర్తించలేదు. ప్రణాళిక ప్రకారం ఓ మహిళ సహాయంతో ఆయనను హనీట్రాప్‌లోకి దింపి, గొంతునులిమి హతమార్చినట్లు అనుమానం వ్యక్తంచేశారు. ఆ తర్వాత మృతదేహంపైన చర్మాన్ని ఒలిచి.. ఎవరూ గుర్తుపట్టకుండా ముక్కలు ముక్కలుగా నరికారు. వాటిని ప్లాస్టిక్‌ సంచుల్లో కుక్కేసి.. స్థానికంగా ఉన్న బాగ్జోలా కాలువతోపాటు వివిధ ప్రాంతాల్లో విసిరేసినట్లు తేల్చారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అవి కొట్టుకుపోయి ఉండవచ్చని, జంతువులు కూడా వాటిని తినే ఆస్కారం ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో వాటిని గుర్తించడం అత్యంత కష్టమని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని