West Bengal: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు.. 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు

West Bengal: కలకత్తా హైకోర్టు మరోసారి సంచలన తీర్పు వెలువరించింది. బెంగాల్‌లో 2010 తర్వాత జారీ అయిన అన్ని ఓబీసీ ధ్రువపత్రాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

Published : 22 May 2024 18:30 IST

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ (West Bengal CM) నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కలకత్తా హైకోర్టు (Calcutta High Court).. బుధవారం మరో సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీలో పలు క్లాసులను కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ ధ్రువపత్రాల (OBC Certificates)ను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

2012 నాటి పశ్చిమబెంగాల్‌ (West Bengal) వెనకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఆ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టంచేసింది.

ప్రచారాల తీరుపై ఈసీ కన్నెర్ర.. భాజపా, కాంగ్రెస్‌ అధ్యక్షులకు నోటీసులు

అందువల్ల 2010 తర్వాత ఈ క్లాసుల కింద జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లన్నింటిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 1993 నాటి వెనకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే, ఈ క్లాసులతో జారీ అయిన ఓబీసీ ధ్రువపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్నవారు, ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్నవారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడించింది.

తీర్పుపై దీదీ అసహనం..

హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అసంతృప్తి వ్యక్తంచేశారు. దీన్ని తాము అంగీకరించబోమని తెలిపారు. ‘‘ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించి బిల్లు తీసుకొచ్చాం. రాజ్యాంగానికి లోబడి తీసుకొచ్చిన ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఇప్పుడు భాజపా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి దీన్ని నిలిపివేయాలని కుట్ర పన్నింది. ఈ తీర్పును మేం అంగీకరింబోం. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయి’’ అని దీదీ స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు