Election Commission: ప్రచారాల తీరుపై ఈసీ కన్నెర్ర.. భాజపా, కాంగ్రెస్‌ అధ్యక్షులకు నోటీసులు

భాజపా, కాంగ్రెస్‌కు చెందిన అగ్ర నేతలు, ముఖ్య ప్రచారకర్తలు చేసే ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటూ ఎన్నికల సంఘం (Election Commission) కన్నెర్ర చేసింది.

Published : 22 May 2024 16:35 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారాల్లో నిమగ్నమైన ప్రధాన రాజకీయ పార్టీలు.. విమర్శనాస్త్రాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో అగ్ర నేతలు, ముఖ్య ప్రచారకర్తలు చేసే ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటూ ఎన్నికల సంఘం (Election Commission) కన్నెర్ర చేసింది. ప్రచారాల్లో కుల, మత ప్రస్తావనలను తీసుకురావడంపైనా విరుచుకుపడింది. నేతల ప్రచారశైలిలో మార్పు రావడం లేదని, ఇకనైనా సరిదిద్దుకోవాలని పేర్కొంటూ భాజపా, కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది.

ఎన్నికల ప్రచారాల్లో మతపరమైన అంశాలకు దూరంగా ఉండాలని భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు ఎన్నికల సంఘం సూచించింది. ముఖ్యంగా సమాజంలో విభజనకు దారితీసే ప్రసంగాలను వెంటనే ఆపాలని భాజపాకు స్పష్టం చేసింది. రాజ్యాంగం రద్దవుతుందనే తప్పుడు అభిప్రాయం కలిగించే ప్రకటనలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ను ఆదేశించింది. అగ్నివీర్‌ వంటి పథకాలపై ప్రసంగాలు చేసేటప్పుడు.. సాయుధ బలగాలను రాజకీయం చేయవద్దని పేర్కొంది.

మోదీకి అమిత్‌షా హింట్‌ ఇస్తున్నారా..?: ‘రిటైర్మెంట్‌’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్‌

భాజపా, కాంగ్రెస్‌లు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, వాటిని సమర్థించుకోవడాన్ని ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. అధికారంలో ఉన్న పార్టీ మరింత బాధ్యతగా వ్యవహరించాలన్న ఈసీ.. ప్రతిపక్ష పార్టీకీ ఈ విషయంలో మినహాయింపు లేదని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థపై భారత ఓటరుకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను ఈసీ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే ప్రచారాల్లో సంయమనం పాటించి, ప్రసంగాలను సరిచేసుకునేలా స్టార్‌ క్యాంపెయినర్లకు సూచించుకోవాలని రెండు జాతీయ పార్టీలకు ఈసీ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని