MS Swaminathan: హరిత భగీరథుడు స్వామినాథన్‌కు భారతరత్న

MS Swaminathan: హరిత విప్లవంతో భారత వ్యవసాయ రంగం ముఖచిత్రాన్ని మార్చేసిన ఎం.ఎస్‌.స్వామినాథన్‌కు తాజాగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.

Updated : 09 Feb 2024 19:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తినే ప్రతి గింజపై మన పేరు ఉంటుందంటారు. భారతీయులకు దాన్ని సార్థకం చేసి పెట్టిన వ్యక్తి దివంగత ఎం.ఎస్‌. స్వామినాథన్‌ (MS Swaminathan). మన దేశ వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చిన హరిత భగీరథుడాయన. ఈరోజు ధాన్యం నిల్వల్లో భారత్‌ స్వయంసమృద్ధి సాధించి ఇతర దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేస్తుందంటే దానికి కారణం.. ఆయన చేసిన పరిశోధనలు, తీసుకొచ్చిన మార్పులే. హరిత విప్లవంతో (Green Revolution) భారత పంట పొలాల ముఖచిత్రం మార్చేశారు. పాడి పంటలే దేశ ప్రగతికి నిజమైన గీటురాళ్లని నమ్మారు. అందుకే.. ఆయన్ని భారత హరిత విప్లవ పితామహుడని ఈ దేశం గొప్పగా కీర్తించుకుంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత భారతరత్న (Bharat Ratna) పురస్కారంతో గౌరవించింది.

ఆకలితో ఎవరూ చనిపోకూడదని..

మాన్‌కొంబు సాంబశివన్‌ స్వామినాథన్‌ (MS Swaminathan) తమిళనాడులోని కుంభకోణంలో 1925 ఆగస్టు 7న జన్మించారు. అతనికి 15 ఏళ్లు నిండకముందే తండ్రి చనిపోవటంతో అప్పటికే కుటుంబం నిర్వహిస్తున్న ఆసుపత్రిని చూసుకొనేందుకు వైద్య విద్య చదవాల్సి వచ్చింది. కానీ, విద్యార్థిగా బెంగాల్‌లో దారుణ క్షామాన్ని చూసిన స్వామినాథన్‌, ఆకలితో ఎవరూ చనిపోయే పరిస్థితి ఉండకూడదని తపించారు. తాను వైద్యవృత్తిని చేపట్టబోనని కుటుంబానికి తేల్చి చెప్పి కోయంబత్తూరులోని మద్రాసు అగ్రికల్చర్‌ కాలేజీలో చేరారు. ప్రిన్సిపాల్‌ పిలిచి ‘మంచి మార్కులు వచ్చాయి. అనవసరంగా ఈ కోర్సులో ఎందుకు చేరాలనుకుంటున్నావు?’ అని స్వామినాథన్‌ను అడుగగా, ఆ సమయంలో అగ్రికల్చర్‌ కోర్సు చదవటమనేది నామోషీగా భావించేవారని, ఆ భావనను తొలగించేందుకే తాను ఇందులో చేరుతున్నానంటూ బదులు చెప్పారట .

ఐపీఎస్‌ వద్దనుకొని..

1944లో మొదలైన స్వామినాథన్‌ (MS Swaminathan) వ్యవసాయ విద్యా ప్రస్థానం- జెనెటిక్స్‌లోకి, పంటలు, దిగుబడుల మెరుగుదల వైపు సాగింది. చీడపీడలను తట్టుకొని ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలను తయారుచేస్తే రైతులకే కాకుండా యావత్‌ మానవాళికి మేలు జరుగుతుందనే తపనతో ఆయన అడుగులు వేశారు. పీజీ పూర్తయ్యాక యూపీఎస్సీ పరీక్షలో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కానీ, ఫెలోషిప్‌పై హాలెండ్‌లో వ్యవసాయ విద్యలో ఉన్నత చదువుకు అవకాశం రావడంతో అటువైపే మొగ్గు చూపారు. బంగాళదుంప జన్యు పరిణామంపై పరిశోధన చేశారు. తర్వాత అమెరికాకు వెళ్లి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ చేశారు. విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్‌ అక్కడే మంచి జీతంపై అధ్యాపక పోస్టు ఆఫర్‌ చేసినా తిరస్కరించారు. 1954లో కటక్‌లోని ‘కేంద్ర వరి పరిశోధన సంస్థ’లో చేరి, తర్వాత భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థకు మారారు.

అలా హరిత విప్లవానికి బీజం..

స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో ఏటా 60 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే పండేవి. విదేశాల నుంచి సరకు వస్తేగానీ పొట్ట నిండని పరిస్థితి. అమెరికా నుంచి గోధుమలను భారీగా దిగుమతి చేసుకునేవాళ్లం. 1960ల ఆరంభంలోనూ దేశంలో గోధుమల ఉత్పత్తి కోటి టన్నులు మాత్రమే. వరి దిగుబడి మరింత తక్కువ. 1966లో కరవు కారణంగా కోటి టన్నుల గోధుమల్ని అమెరికా నుంచి తెప్పించుకున్నాం. ఈ నేపథ్యంలో భారత వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మార్చాలని స్వామినాథన్‌ నడుం బిగించటంతో హరిత విప్లవానికి (Green Revolution) బీజం పడింది. అధిక దిగుబడినిచ్చే వంగడాల తయారీ, ట్రాక్టర్ల లాంటి ఆధునిక పరికరాల వాడకం, సాగునీటి సదుపాయాలు మెరుగుపరచటం, ఎరువులు, పురుగుమందుల వాడకం, సాగు విస్తీర్ణం పెంచటం ఈ హరిత విప్లవంలో ప్రధానాంశాలు. 1967-68 నుంచి 1977-78 మధ్య పరిస్థితిలో భారీ మార్పు మొదలైంది. భారత సంప్రదాయ వంగడాలు ఏపుగా, సన్నగా పెరిగి గాలికి వాలిపోయేవి. కాస్త తక్కువ ఎత్తుతో దృఢంగా నిలిచి ఎక్కువ దిగుబడి నిచ్చే వరి వంగడాలపై స్వామినాథన్‌ బృందం చేసిన పరిశోధనలు కొంతమేరకు సత్ఫలితాలనివ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో గోధుమలపై దృష్టి సారించారు. వరి, గోధుమ తదితర పంటలపై స్వామినాథన్‌ జరిపిన విశేష కృషితో దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది.

స్వామినాథన్‌ తపనే ఆసియాలో హరిత విప్లవం

అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడాల కోసం శోధన మొదలైంది. ఈ క్రమంలో స్వామినాథన్‌కు అమెరికన్‌ వ్యవసాయ శాస్త్రవేత్త ఒర్‌విలె వోగెల్‌ పరిచయమయ్యారు. ఆయన అప్పటికే ఓ మరుగుజ్జు గోధుమ వంగడాన్ని అభివృద్ధి చేశారు. కానీ తన వంగడం భారత వాతావరణ పరిస్థితుల్లో పని చేయకపోవచ్చంటూనే, అప్పటికే మెక్సికోలో ఇలాంటి గోధుమ వంగడాలను రూపొందించిన నార్మన్‌ బోర్లాగ్‌ను సంప్రదించాలని స్వామినాథన్‌కు సలహా ఇచ్చారు.  ఆ విత్తనాలు భారత వాతావరణానికి కూడా సరిపోయేలా ఉండటంతో స్వామినాథన్‌ బోర్లాగ్‌ను కలిసి పరిస్థితి వివరించారు. బోర్లాగ్‌ తాను తయారుచేసిన వంగడాలను ఇవ్వటమే కాకుండా భారత్‌కు వచ్చేందుకు అంగీకరించారు. అలా 1963లో నార్మన్‌ బోర్లాగ్‌ (ఈయనకు 1970లో నోబెల్‌ బహుమతి లభించింది) తయారుచేసిన పొట్టి గోధుమ వంగడాలను భారత్‌లో తయారుచేయటం మొదలుపెట్టారు. ఆ పరిశోధన ప్రయత్నాలు ఫలించి హెక్టారుకు నాలుగున్నర టన్నుల దిగుబడి వచ్చింది. 1960కి ముందు హెక్టారుకు 2 టన్నులున్న వరి దిగుబడి రెట్టింపైంది. హరిత విప్లవ పితామహుడిగా స్వామినాథన్‌ పేరు మారుమోగింది. బోర్లాగ్‌ సైతం స్వామినాథన్‌ను కొనియాడారు. ‘‘ఈ ఘనత అంతా స్వామినాథన్‌కే చెందుతుంది. మెక్సికో కోసం తయారుచేసిన ఈ వంగడాల విలువను ఆయన గుర్తించకుంటే, వాటి కోసం తపించకుంటే ఆసియాలో హరిత విప్లవమే వచ్చి ఉండేది కాదు’’ అని ప్రశంసించారు. తర్వాత స్వామినాథన్‌ సారథ్యంలో భారతీయ శాస్త్రవేత్తలు మరిన్ని మేలైన వంగడాలను సృష్టించారు.

హరితం కాదు సతత హరితం

హరిత విప్లవం కారణంగా రసాయనాలు, ఎరువుల వాడకం పెరిగి భూసారం తగ్గిందనే విమర్శలనూ అంగీకరించటం స్వామినాథన్‌ వినమ్రతకు నిదర్శనం. ‘‘స్థానికంగా ఉండే వంగడాలను కోల్పోవద్దు. భూసారాన్ని కాపాడుకోకుండా, నీటి యాజమాన్య పద్ధతులు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవసాయం చేస్తే ఎడారులను సృష్టించినవారమవుతాం. హరిత విప్లవం కంటే సతత హరిత (ఎవర్‌గ్రీన్‌) విప్లవం కావాలి’’ అని ఆయన కోరుకున్నారు.

అవార్డుల పంట..

రామన్‌ మెగసెసే (1971), రాబర్ట్‌ ఐన్‌స్టీన్‌ వరల్డ్‌ సైన్స్‌ (1986), ఎన్విరాన్‌మెంటల్‌ అచీవ్‌మెంట్‌ (1991) తదితర వందకు మించి పురస్కారాలు స్వామినాథన్‌ పొందారు. దేశంలో అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ తాజాగా భారతరత్న ఆయన్ను వరించాయి. 1987లో ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌’ అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలు 84 గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశాయి. 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా టైం మ్యాగజైన్‌ గుర్తించింది. 2007 నుంచి 2013 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 

ఎంతో శోధించి, పరిశోధించి రూపొందించిన వంగడాలతో భారత్‌లో బంగారు పంటలు పండించిన స్వామినాథన్‌.. వయోధిక కారణాలతో చెన్నై తేనాంపేటలోని స్వగృహంలో 2023 సెప్టెంబర్‌ 28న తుదిశ్వాస విడిచారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని