LK advani: ఆడ్వాణీకి భారతరత్న ప్రదానం.. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి

LK advani: మాజీ ఉపప్రధాని ఎల్‌కే ఆడ్వాణీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు.

Updated : 31 Mar 2024 14:58 IST

దిల్లీ: భాజపా అగ్రనేత, మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ ఆడ్వాణీకి (LK Advani) అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను (Bharat Ratna) ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరుకాలేకపోయారు. దీంతో ఆయన నివాసానికే వెళ్లి నేడు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

తెలుగుబిడ్డ పి.వి.నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను (Bharat Ratna) శనివారం మరణానంతరం ప్రదానం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపదీ ముర్ము నుంచి పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు దీనిని స్వీకరించారు. మరో మాజీ ప్రధాని చౌధరి చరణ్‌సింగ్‌, హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్‌లకు కూడా మరణానంతరం ప్రకటించిన ఈ పురస్కారాలను వారివారి కుటుంబ సభ్యులు స్వీకరించారు. చరణ్‌సింగ్‌ తరఫున ఆయన మనవడు జయంత్‌ చౌధరి, స్వామినాథన్‌ తరఫున ఆయన కుమార్తె నిత్యారావు, కర్పూరీ ఠాకుర్‌ తరఫున ఆయన కుమారుడు రామ్‌నాథ్‌ ఠాకుర్‌లు పురస్కారాలు అందుకున్నారు.

14 ఏళ్లకే ఆరెస్సెస్‌లోకి

1927 నవంబరు 8న అవిభక్త భారత్‌లోని కరాచీ (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో ఆడ్వాణీ (LK Advani) జన్మించారు. అక్కడే సెయింట్‌ పాట్రిక్స్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్య అభ్యసించారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆరెస్సెస్‌లో చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. పాక్‌లోని హైదరాబాద్‌లో ఉన్న డీజీ నేషనల్‌ కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిరపడ్డారు. తొలుత రాజస్థాన్‌లో సంఘ్‌ ప్రచారక్‌గా పనిచేశారు. 1957లో దిల్లీకి వెళ్లి జన్‌సంఘ్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1966లో దిల్లీ మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. 1967లో ఆ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా గెలిచారు. 1970-72లో భారతీయ జనసంఘ్‌ దిల్లీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. ‘ఆర్గనైజర్‌’ పత్రికలో నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా పనిచేశారు. అయోధ్య రథయాత్రతో పాటు పలు యాత్రలు చేసి తనదైన ముద్ర వేశారు.

రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో అడుగు

ఆడ్వాణీ 1970లో దిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. 1976లో గుజరాత్‌ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ పార్టీ ప్రభుత్వంలో 1977-79 మధ్య కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 1980లో జనతా పార్టీ ఓటమి పాలైన అనంతరం రాజ్యసభలో కొంతకాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.

పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు

1980 ఏప్రిల్‌ 6న వాజ్‌పేయీతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1982లో మధ్యప్రదేశ్‌ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్‌పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది. ఆ తర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి భాజపా మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆడ్వాణీ గెలిచారు. 2004 ఎన్నికల్లో భాజపా ఓటమిపాలవ్వడంతో ఆడ్వాణీ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో భాజపా ప్రధాని అభ్యర్థిగా పోటీచేశారు. కానీ, ఆ ఎన్నికల్లో కాషాయ దళం ఓడిపోయింది. 2014లో మరోసారి గాంధీనగర్‌ నుంచి గెలుపొందిన ఆడ్వాణీ.. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని