Gautam Adani: అదానీకి భారీ ఊరట!
విదేశీ లంచాల చట్టం అమలుకు ట్రంప్ బ్రేక్ 
కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం

వాషింగ్టన్: భారత్‌కు చెందిన అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీకి పెద్ద ఊరట లభించినట్లే. అదానీ గ్రూప్, గ్రూప్‌నకు చెందిన పలువురు వ్యక్తులపై నమోదైన లంచం కేసు విషయంలో, దర్యాప్తు కోసం వినియోగించిన యాభై ఏళ్ల నాటి చట్టం అమలుకు విరామం ప్రకటించాలని అమెరికా న్యాయ శాఖను ఆదేశిస్తూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు(ఈఓ)పై సంతకం చేయడం ఇందుకు నేపథ్యం. వ్యాపారాల్లో కొనసాగడానికి, ప్రాజెక్టులు దక్కించుకోవడానికి విదేశీ ప్రభుత్వాలు, అధికారులకు లంచం ఇచ్చే అమెరికా కంపెనీలు, విదేశీ సంస్థలపై చర్యలు తీసుకునే 1977 ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్(ఎఫ్‌సీపీఏ) అమలును నిలిపేస్తూ ట్రంప్ సంతకాలు చేసి, యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండికి ఆదేశాలు జారీ చేశారు.
ఏం జరిగిందంటే
20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేలా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ‘ఉన్నత స్థాయి’ వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు ఎఫ్‌సీపీఏ కింద పలువురిపై అమెరికాలో కేసులు నమోదు చేశారు. ఆ నిధులను అమెరికాలో పెట్టుబడి కింద అదానీ గ్రూప్ సమీకరించడమే అక్కడ కేసు నమోదుకు కారణం. సౌర విద్యుత్ విక్రయ కాంట్రాక్టుల్లో అనుకూల షరతులు అమలు చేసేందుకు అదానీ గ్రూప్ 250 మిలియన్ డాలర్ల (రూ.2029 కోట్లు) మేర లంచాలు ఇచ్చారన్నది ఆరోపణ. ఇందులో రూ.1750 కోట్లు (228 మి.డాలర్లు) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘ఉన్నత స్థాయి’ వర్గాలకు ఇచ్చినట్లు, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో అదానీ భేటీ తర్వాతే ఒప్పందాలు జరిగాయని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ కమిషన్ తన ఫిర్యాదులో పేర్కొంది. అదానీపై దర్యాప్తు చేపట్టాలంటూ అమెరికా అధ్యక్షుడిగా అప్పుడున్న జోబైడన్ నేతృత్వంలోని న్యాయ శాఖ ఆదేశాలు జారీ చేయడంతో అదానీ గ్రూప్ ఛైర్మన్‌తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ లంచాలను చెల్లించడానికి, ప్రాజెక్టు నిధుల నిమిత్తం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికా బ్యాంకులు, పెట్టుబడిదార్ల నుంచి అదానీ గ్రూప్ భారీమొత్తంలో నిధులు సమీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తమపై నమోదైన ఆరోపణలన్నిటినీ అదానీ గ్రూప్ కొట్టిపారేస్తూ వచ్చింది.
ఇప్పుడు ఏం చేస్తారంటే..
తాజాగా ట్రంప్ ఆదేశాలు, అదానీ గ్రూప్‌నకు ఊరటనిచ్చేవే. ‘ఎఫ్‌సీపీఏ కింద ఉన్న మార్గదర్శకాలను, దర్యాప్తునకు సబంధించిన విధానాలను అటార్నీ జనరల్ సమీక్షించాలి. సమీక్షా కాలంలో ఏ కొత్త ఎఫ్‌సీపీఏ దర్యాప్తు, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను మొదలుపెట్టకుండా అటార్నీ జనరల్ చర్యలు తీసుకోవచ్చు. లేదంటే ఏదో ఒక కేసుకే ఈ చట్టం అమలును నిలిపివేసే చర్యలూ తీసుకోవచ్చ’ని ఆ ఆదేశాల్లో ఉంది. ప్రస్తుత ఎఫ్‌సీపీఏ దర్యాప్తులన్నిటిని సమీక్షించి, తగిన చర్యలు తీసుకోవాలనీ అందులో పేర్కొంది. మార్గదర్శకాలు, విధానాల సవరణలు జారీ అయ్యాక అటార్నీ జనరల్ అదనపు చర్యలను నిర్ణయిస్తారు. గతంలోని ఎఫ్‌సీపీఏ దర్యాప్తులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలకు సంబంధించిన దిద్దుబాటు చర్యలు అవసరమా కాదా, ఏవైనా చర్యలు తీసుకోవాలా, అధ్యక్ష జోక్యం అవసరమవుతుందా లాంటివి పరిశీలిస్తుంది. అనంతరం అధ్యక్షుడికి ఆయా చర్యలను సిఫారసు చేస్తుంది. బైడన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయ శాఖ తీసుకున్న నిర్ణయాలు ‘ప్రశ్నార్థకం’గా ఉన్నాయంటూ కొత్త అటార్నీ జనరల్‌కు ఆరుగురు యూఎస్ కాంగ్రెస్‌మెన్ లేఖ రాయడమూ ఈ సందర్భంలో గమనార్హం.
అదానీ గ్రూప్ షేర్ల మిశ్రమ స్పందన
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయినా, బీఎస్‌ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 1.37%, అదానీ పవర్ షేరు 1.39% మేర లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 0.34%, అదానీ గ్రీన్ ఎనర్జీ 1.04%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 1.13%, అంబుజా సిమెంట్ 1.35%, ఏసీసీ 1.38%, అదానీ టోటల్ గ్యాస్ 2.12%, అదానీ విల్మర్ 5.34% నష్టపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


