వీల్‌ఛైర్‌లో రాజ్యసభకు మన్మోహన్‌ సింగ్ రాక.. కాంగ్రెస్‌పై భాజపా విమర్శలు

రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో పాల్గొనేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) పార్లమెంట్‌కు వచ్చారు. దీనిపై భాజపా స్పందించింది. 

Published : 08 Aug 2023 15:56 IST

దిల్లీ: దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) సోమవారం రాజ్యసభకు వీల్‌ఛైర్‌లో వచ్చి, ఓటేశారు. దీనిపై విపక్ష నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే అనారోగ్యంతో ఉన్న ఆయన వచ్చి ఓటింగ్‌లో పాల్గొనడం.. భాజపా(BJP), కాంగ్రెస్(Congress) మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.  సిగ్గుచేటు చర్య అంటూ కమలం పార్టీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. 

కీలక సమయంలో రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్‌(Manmohan Singh)కు ఆప్ ఎంపీ రాఘవ చద్దా(Raghav Chadha) కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మన్మోహన్ సింగ్  విలువలకు అసలైన అర్థం చాటిచెప్పారు. మరీ ముఖ్యంగా బ్లాక్‌ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు వచ్చారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల ఆయనకున్న నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకం. కృతజ్ఞతలు సర్’ అని ఆయన రాకపై చద్దా స్పందించారు. ఆయన హాజరు నేపథ్యంలో కాంగ్రెస్‌పై భాజపా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. 

‘చివరి బంతికి సిక్స్‌ కొట్టండి’.. అవిశ్వాసం వేళ ఎంపీలకు మోదీ సూచన

‘కాంగ్రెస్ తెలివితక్కువతనాన్ని దేశం మొత్తం గుర్తుంచుకుంటుంది. ఆరోగ్యం సరిగాలేని మాజీ ప్రధానిని  కాంగ్రెస్‌ రాత్రి పూట పార్లమెంట్‌లో కూర్చోబెట్టింది. నిజాయతీలేని ఓ కూటమిని బతికించుకోవడం కోసం ఈ విధంగా ప్రవర్తించింది. ఇంతకంటే సిగ్గుచేటు చర్య ఉంటుందా..?’ అని మండిపడింది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత సుప్రియా శ్రినతె తిప్పికొట్టారు. ఇది ప్రజాస్వామ్యంపై ఆయనకున్న విశ్వాసానికి నిదర్శమని అన్నారు.

90 ఏళ్ల మన్మోహన్ సింగ్‌(Manmohan Singh)తో పాటు ఝార్ఖండ్ ముక్తి మోర్చా కురువృద్ధుడు శిబు సోరెన్‌ కూడా నిన్న సభకు వచ్చారు. ఆప్‌ తీవ్రంగా వ్యతిరేకించిన దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు నిన్న రాజ్యసభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ఓటువేసేందుకే ఈ సీనియర్‌ నేతలు పార్లమెంట్‌కు హాజరయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని