Modi: ‘చివరి బంతికి సిక్స్‌ కొట్టండి’.. అవిశ్వాసం వేళ ఎంపీలకు మోదీ సూచన

ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చ మొదలైంది. దీనికి ముందు అధికార పక్ష ఎంపీల భేటీలో ప్రధాని మోదీ (PM Modi) కీలక సూచనలు చేశారు. విపక్షాల అస్త్రాన్ని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు.

Published : 08 Aug 2023 12:47 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (no confidence motion)పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) స్పందించారు. అది ప్రభుత్వంపై తీసుకొచ్చిన అవిశ్వాసం కాదని.. వాళ్లలో వారికే నమ్మకం లేక దీన్ని ప్రవేశపెడుతున్నారని విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. అంతేగాక, 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై ‘సిక్స్‌’ కొట్టాలని స్వపక్ష ఎంపీలకు సూచించారు. ఈ మేరకు పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభానికి ముందు జరిగిన భాజపా (BJP) పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అవిశ్వాసంపై ఎలా స్పందించాలన్న అంశంపై భాజపా పార్లమెంటరీ పార్టీ మంగళవారం ఉదయం సమావేశమైంది. ఈ భేటీలో మోదీ (Modi) ప్రసంగిస్తూ విపక్షాలపై ఘాటు విమర్శలు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘దిల్లీ సర్వీసుల బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌ను కొందరు విపక్ష నేతలు 2024 లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు ‘సెమీఫైనల్‌’గా అభవర్ణించారు. అయితే, దీనిలో ఫలితం ఏంటో దేశ ప్రజలంతా చూశారు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ‘సెమీఫైనల్‌’లో విజయం సాధించినందుకు గానూ పార్టీ ఎంపీలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసినట్లు సదరు వర్గాలు తెలిపాయి.

ఇక లోక్‌సభలో విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మోదీ స్పందిస్తూ.. ‘‘ప్రతిపక్షాల కూటమిలో పరస్పర విశ్వాసం సన్నగిల్లింది. అందుకే ఈ తీర్మానాన్ని తీసుకొచ్చారు. కూటమిలో తమకు ఎవరెవరు ఐక్యంగా ఉన్నారు? ఎవరు లేరు? అనేది పరీక్షించుకునేందుకే వారు ఈ ప్రయత్నం చేస్తున్నారు. అంతేగానీ, ఇది మన ప్రభుత్వంపై తీసుకొచ్చిన అవిశ్వాసం కాదు’’ అని మోదీ విమర్శించారు. 

ఇక అవిశ్వాసంపై అధికార పక్షం వ్యూహాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఎలాగైతే చివరి బంతికి సిక్స్‌ కొట్టాలో.. ప్రస్తుత పరిస్థితులను ప్రతిపక్షాలపై అవకాశంగా భావించండి. 2024 ఎన్నికలకు ముందు చివరి బంతికి ‘సిక్స్‌’ కొట్టండి’’ అని పార్టీ ఎంపీలకు ప్రధాని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని