PM Modi: అంబేడ్కర్‌ కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు - మోదీ

తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కూడా ఇప్పుడు దాన్ని రద్దు చేయలేరని ప్రధాని మోదీ (Narendra Modi) పేర్కొన్నారు.

Updated : 12 Apr 2024 20:07 IST

జైపుర్‌: భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని (Constitution) మారుస్తుందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని మోదీ (Narendra Modi) మరోసారి స్పందించారు. తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కూడా ఇప్పుడు దాన్ని రద్దు చేయలేరన్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల (Lok Sabha Elections) ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్‌ అండగా నిలుస్తోందన్నారు. దేశాన్ని బలహీనపరిచేందుకు విపక్షాల కూటమి ‘ఇండియా’ ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టారు.

‘తమ ప్రభుత్వానికి రాజ్యాంగమే సర్వస్వం. ఇప్పుడు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్వయంగా వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు. దేశంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా రాజ్యాంగాన్ని నాశనం చేసే ప్రయత్నం కాంగ్రెస్‌ చేసింది. ఇప్పుడు అదే పేరుతో మోదీపై దుర్భాషలాడుతోంది’ అని కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. అణు నిరాయుధీకరణ గురించి విపక్షాలు మాట్లాడటం శోఛనీయమన్నారు. పొరుగున అణ్వాయుధాలు కలిగిన దేశాలు ఉండగా.. వీటి నిర్మూలన గురించి మాట్లాడుతారా? అంటూ ప్రశ్నించారు. ఎవరి సూచనల మేరకు విపక్ష కూటమి పని చేస్తోందని కాంగ్రెస్‌ను ప్రశ్నించదలచుకున్నానని ప్రధాని మోదీ అన్నారు.

ఎన్నికల ప్రచారానికెళ్తా.. బెయిలివ్వండి: మనీశ్‌ సిసోదియా పిటిషన్‌

రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే పార్లమెంటులో భాజపాకు భారీ మెజార్టీ రావాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండి పడుతున్నాయి. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని భాజపా సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ రాహుల్‌ గాంధీ సహా విపక్ష నేతలు దీనినే ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తో సహా విపక్షాల తీరుపై ప్రధాని మోదీ మరోసారి ప్రతిదాడికి దిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని