Manish Sisodia: ఎన్నికల ప్రచారానికెళ్తా.. బెయిలివ్వండి: మనీశ్‌ సిసోదియా పిటిషన్‌

Manish Sisodia: లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ఆప్‌ నేత మనీశ్ సిసోదియా పిటిషన్‌ వేశారు. దీనిపై దర్యాప్తు సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

Updated : 12 Apr 2024 15:56 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ మద్యం కేసు వ్యవహారం ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP)కి తలనొప్పిగా మారింది. కేజ్రీవాల్‌ సహా కీలక నేతలు జైల్లో ఉండటంతో ప్రచారం నెమ్మదించింది. ఈ పరిణామాల వేళ ఆ పార్టీ నేత, దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా (Manish Sisodia) మరోసారి దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సిసోదియా పిటిషన్‌ను స్వీకరించిన సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు.. దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆయన అభ్యర్థనపై స్పందనలు తెలియజేయాలని ఆదేశించింది. అనంతరం దీనిపై విచారణను ఏప్రిల్‌ 20వ తేదీకి వాయిదా వేసింది.

త్వరలో దిల్లీలో రాష్ట్రపతి పాలన..! ఆతిశీ సంచలన ఆరోపణలు

దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi Excise Scam Case)లో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు సిసోదియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన తిహాడ్‌ జైల్లో ఉన్నారు. ఈ కేసుల్లో బెయిల్‌ కోరుతూ ఆయన పలుమార్లు పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ న్యాయస్థానాల్లో ఊరట లభించలేదు.

మరోవైపు, ఇదే కేసులో ఇటీవల ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇక, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ అరెస్టవగా.. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా.. ఎన్నికల వేళ  ఆమ్‌ఆద్మీని బలహీనపర్చేందుకే తమ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని పార్టీ ఆరోపిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆప్‌ పోటీ చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని