Kejriwal: నా భర్తను జైల్లో చంపాలని చూస్తున్నారు - సునీత కేజ్రీవాల్‌ ఆరోపణ

అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఇచ్చే ప్రతి ఆహారాన్ని జైలు అధికారులు పర్యవేక్షిస్తున్నారని సునీత కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Published : 21 Apr 2024 18:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తిహాడ్‌ జైల్లో ఉన్న తన భర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను చంపాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందని సునీత కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆయనకు ఇచ్చే ప్రతి ఆహారాన్ని జైలు అధికారులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. విపక్ష కూటమి ‘ఇండియా’ ఆధ్వర్యంలో రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా విపక్షాల కూటమి పోరాడుతోందన్నారు.

‘నా భర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ను చంపాలని అనుకుంటున్నారు. ఆయనకిచ్చే ఆహారాన్ని పర్యవేక్షించేందుకు కెమెరాలు ఏర్పాటు చేశారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయన.. 12ఏళ్లుగా ఇన్సులిన్‌ తీసుకుంటున్నారు. కానీ, ఆయనకు మాత్రం జైల్లో ఇన్సులిన్ ఇవ్వడం లేదు. ఆయనకు రోజు 50 యూనిట్ల ఇన్సులిన్‌ అవసరం’ అని సునీత కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌లను ఈడీ అరెస్టు చేయడంపై మండిపడ్డ ఆమె.. నేరం రుజువు కాకుండానే వాళ్లను జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించలేమా!

కేంద్ర ప్రభుత్వానిది నియంతృత్వమేనని.. మంచి విద్య, ఆరోగ్య వసతులు కల్పించడమే తన భర్త చేసిన తప్పిదమా? అని సునీత ప్రశ్నించారు. ప్రజల కోసం ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టారని అన్నారు. ‘‘ఆయన ఐఐటీలో చదివారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ, దేశభక్తికి ప్రాధాన్యం ఇచ్చారు. ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన ఆయన.. ప్రజాసేవ కోసం ముందుకు వచ్చారు. ప్రజలకోసం తన జీవితాన్ని పణంగా పెట్టారు’’ అని అన్నారు.

నేతల కోసం ఖాళీ కుర్చీలు..

విపక్ష కూటమి రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జైల్లో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ల కోసం సభా వేదికపై ప్రత్యేకంగా ఖాళీ కుర్చీలు ఉంచారు. వేదిక బయట ఇద్దరు నాయకుల భారీ కటౌట్‌లను ఏర్పాటు చేశారు. కార్యకర్తలు వీరికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని