BJP: ‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్‌ నోటీసులు

BJP: భాజపా ఎంపీ జయంత్‌ సిన్హా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో భాజపా ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Updated : 21 May 2024 10:47 IST

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, తమ పార్టీ ఎంపీ జయంత్‌ సిన్హా (Jayant Sinha) తీరుపై భాజపా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన.. తాజా ఎన్నికల్లో ఓటు హక్కు కూడా వినియోగించుకోకపోవడంపై ఆగ్రహించింది. దీంతో చర్యలకు ఉపక్రమించింది. షోకాజ్‌ నోటీసులు (Show Cause Notice) జారీ చేసింది.

‘‘హజారీబాగ్‌ లోక్‌సభ స్థానం అభ్యర్థి (BJP Lok Sabha candidate)గా మనీశ్ జైస్వాల్‌ (Manish Jaiswal)ను ప్రకటించినప్పటి నుంచి మీరు పార్టీ (BJP) సంస్థాగత కార్యాచరణ, ఎన్నికల ప్రచారంపై ఆసక్తి కనబర్చడం లేదు. కనీసం ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరాన్ని కూడా మీరు గుర్తించలేదు. మీ ప్రవర్తన వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింది’’ అని భాజపా ఆ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఈ నోటీసులపై సిన్హా ఇంకా స్పందించలేదు.

దిల్లీ మెట్రో రైళ్లలో కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ రాతలు

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ (Hazaribagh) సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న జయంత్‌ సిన్హా ఈ సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections)కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పర్యావరణ మార్పుల అంశంపై దృష్టి కేంద్రీకరించేందుకు సమయం వెచ్చిస్తానని, అందుకోసం ప్రత్యక్ష ఎన్నికల బాధ్యతల నుంచి తనను (Jayant Sinha) తప్పించాలని మార్చిలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం నుంచి పార్టీ మనీశ్ జైస్వాల్‌కు అవకాశం కల్పించింది. 

అయితే, ఆ తర్వాత నుంచి పార్టీ (BJP) సంస్థాగత వ్యవహారాలకు కూడా సిన్హా దూరంగా ఉన్నారు. హజారీబాగ్‌ స్థానానికి ఐదో విడత (Fifth Phase of Polls)లో భాగంగా సోమవారం పోలింగ్‌ జరిగింది. ఇందులో ఆయన ఓటు వేయకపోవడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా కుమారుడే జయంత్. ప్రస్తుతం యశ్వంత్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని