BJP-Congress: హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యల దుమారం.. వివాదంలో మరో కాంగ్రెస్ నేత

హేమమాలిని (Hema Malini)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భాజపా విమర్శలు చేస్తోన్న తరుణంలో.. ముందు పూర్తి ప్రసంగాన్ని చూడండంటూ కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా పోస్టు పెట్టారు. 

Published : 04 Apr 2024 12:39 IST

దిల్లీ: ఎంపీ, నటి హేమమాలిని (Hema Malini) పై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై భాజపా ఆక్షేపణ వ్యక్తంచేసింది. మహిళలను కించపర్చారంటూ ఒక వీడియోను పోస్టు చేసింది. ‘‘కాంగ్రెస్‌ ఎంపీ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అవి హేమమాలినిజీనే కాకుండా మహిళలందరినీ అవమానించేలా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం కూడా ఆ పార్టీకి చెందిన నాయకురాలు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్’’ అని భాజపా ప్రతినిధి అమిత్‌ మాలవీయ మండిపడ్డారు.

ఈ వివాదంపై భాజపా మండి అభ్యర్థి కంగనా రనౌత్ స్పందించారు. ‘‘తాము ప్రేమ దుకాణాలు తెరిచామని వారు చెప్తున్నారు. కానీ వారు తెరిచింది ద్వేష దుకాణాలు. మహిళల పట్ల నీచమైన అభిప్రాయం కలిగిన కాంగ్రెస్ నేతలు.. ఓటమి తప్పదనే నిరాశతో మరింత దిగజారుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడమే వారి పని అంటూ హేమమాలిని వ్యాఖ్యానించారు.

అయితే ఈ విమర్శలను కాంగ్రెస్‌ తోసిపుచ్చింది. ప్రసంగంలోని కొన్ని అంశాలను మాత్రమే బయటపెట్టి, వక్రీకరించారంటూ విమర్శించింది. ‘‘ముందు పూర్తి ప్రసంగం చూడండి. మేము హేమమాలిని ఎంతో గౌరవిస్తాము ఎందుకంటే.. ఆమె ధర్మేంద్రజీని వివాహం చేసుకున్నారని నేను చెప్పాను. ఆమె మా ప్రాంత కోడలు. నాకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు’’ అంటూ సూర్జేవాలా ఆ వీడియోను పోస్టు చేశారు. అలాగే ఎవరైనా సరే ప్రజలకు జవాబుదారీగాఉండాలని పోస్టులో పేర్కొన్నారు.

ఇటీవల కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్.. కంగనా రనౌత్‌ను ఉద్దేశించి పెట్టిన పోస్టు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దాంతో ఆమెకు సొంత పార్టీ నుంచే షాక్ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కూడా షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని