BJP: ఫలితాల వేళ.. భాజపా నేతల కీలక భేటీ.. రాజకీయ పరిస్థితులపై వ్యూహాలు

మరో కొన్ని గంటల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. విజయంపై ధీమాగా ఉన్న భాజపా నేతలు కీలక భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది.

Published : 03 Jun 2024 14:25 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. మూడోసారి కూడా కేంద్రంలో భాజపా (BJP)నే ప్రభుత్వం ఏర్పాటుచేయనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్‌ నేతలు సోమవారం కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.

ఫలితాలు వెలువడనున్న తరుణంలో తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలపై చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. ప్రధాని మోదీ నాయకత్వంలో కాషాయదళం గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. అయితే.. ఈ భేటీపై భాజపా అధికారికంగా ప్రకటన చేయాల్సిఉంది.

మరోవైపు.. ఎన్నికల ఫలితాల విడుదలపై యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈనేపథ్యంలో భాజపా, విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఎన్నికల సంఘంతో ఇటీవల సమావేశమయ్యారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని భాజపా ఫిర్యాదు చేసింది. ఓట్ల లెక్కింపు వేళ అన్ని మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని ఇండియా కూటమి ఈసీని కోరింది. 

64.2 కోట్ల మంది ఓటేశారు.. ప్రపంచ రికార్డు సృష్టించామన్న ఈసీ

మోదీతో నీతీశ్‌ భేటీ

ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. అయితే, ఈ సమావేశానికి సంబంధించిన వివరాలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని