Sushil Kumar Modi: 6 నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నా: సుశీల్‌ కుమార్‌ మోదీ ప్రకటన

Sushil Kumar Modi: తాను ఆరు నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు భాజపా నేత, మాజీ ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ ప్రకటించారు.

Published : 03 Apr 2024 13:31 IST

పట్నా: భాజపా (BJP) సీనియర్‌ నేత, బిహార్‌ (Bihar) మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ (Sushil Kumar Modi) క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని బుధవారం ఆయనే స్వయంగా వెల్లడించారు. గత కొంతకాలంగా తాను ఈ వ్యాధితో పోరాడుతున్నానని తెలిపారు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఎన్నికల ప్రక్రియలో భాగం కాలేకపోతున్నట్లు పేర్కొన్నారు.

‘‘గత ఆరు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నా. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. ఈ లోక్‌సభ ఎన్నికల్లో నేనేమీ (పోటీ లేదా ప్రచారాన్ని ఉద్దేశిస్తూ) చేయలేను. ప్రధానికి అన్ని వివరించా. ఈ దేశం, బిహార్‌, పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. నా జీవితం ప్రజా సేవకు అంకితం’’ అని సుశీల్ మోదీ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

మోదీకి సరైన పోటీ ఎవరు..? శశిథరూర్‌ ఆసక్తికర సమాధానం

72 ఏళ్ల సుశీల్‌ కుమార్‌ బిహార్‌ రాజకీయాల్లో సీనియర్‌ నేత. 2005 నుంచి 2020 మధ్య సీఎం నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వంలో రెండు దఫాలుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 2020లో ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాసవాన్‌ మరణంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నికల్లో ఆ సీటుకు సుశీల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2న ఆయన పదవీకాలం ముగిసింది. అయితే, ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రెండోసారి టికెట్‌ ఇచ్చేందుకు భాజపా హైకమాండ్‌ నిరాకరించింది.

ఈ క్రమంలోనే ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పటివరకు టికెట్‌ దక్కలేదు. మరోవైపు, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన భాజపా ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో సుశీల్‌ సభ్యుడిగా ఉన్నారు. అయితే, తాజా పోస్ట్‌తో ఆయన ఈ కమిటీ వ్యవహారాల నుంచి కూడా వైదొలగనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని