ఖరీదైన మార్బుల్స్‌..ఒక్కో కర్టెన్‌కు రూ.8 లక్షలు: కేజ్రీవాల్‌ నివాసంపై భాజపా విమర్శలు

ఆప్‌, భాజపా మధ్య ఏదో ఒక అంశంపై నిత్యం వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఇంటి మరమ్మతుపై ఈ రెండు పార్టీలు విమర్శలు గుప్పించుకున్నాయి. 

Published : 26 Apr 2023 19:33 IST

దిల్లీ: ఇంటి మరమ్మతుల కోసం దిల్లీ(Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal ) రూ.45 కోట్లు వెచ్చించారని భాజపా(BJP) తీవ్ర ఆరోపణలు గుప్పించింది. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నిజాయతీ, నిరాడంబరత గురించి మాట్లాడిన వ్యక్తి.. ఇప్పుడు తనను తాను మహారాజులా భావిస్తున్నారని దుయ్యబట్టింది. ఈ విషయాలు బయటపెట్టకుండా ఉండేందుకు కేజ్రీవాల్ మీడియా సంస్థలకు రూ.20 నుంచి 50 కోట్లు ఆఫర్‌ చేసినట్లు కమలం పార్టీ నేత సంబిత్ పాత్ర ఆరోపించారు. కానీ ఆ ఆఫర్‌ను మీడియా సంస్థలు తిరస్కరించాయని తెలిపారు. 

కేజ్రీవాల్‌(Arvind Kejriwal ) తన ఇంటి మరమ్మతు కోసం వియత్నాం నుంచి తెచ్చిన మార్బుల్‌ను అమర్చారని, కర్టెన్స్ కోసం లక్షల రూపాయలు వెచ్చించినట్లు చెప్పారు. ఒక్క కర్టెన్ విలువ రూ.7.94 లక్షలన్నారు. ఇది ఒక రాజు స్టోరీ అంటూ కొన్ని దస్త్రాలను ఉదహరించారు. కేజ్రీవాల్‌ వీటన్నింటికీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, దీనిపై ప్రస్తుతం ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. 

కానీ ఆప్‌ ప్రతినిధి ప్రియాంకా కక్కర్.. కేజ్రీవాల్ ఇంటి వీడియోను షేర్ చేశారు. ‘డొనాల్డ్‌ ట్రంప్‌ మూడు గంటల పర్యటన కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు విమానప్రయాణాల కోసం కోట్లను వెచ్చించారు. వీటిని ఏ చానెల్ బయటపెట్టదు. కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు 1942 నాటి బంగ్లాను కేటాయించారు. ఒక ఎకరం కంటే తక్కువ వైశాల్యంలో ఉన్న ఈ ఇంటి పైకప్పు పెచ్చులు మూడుసార్లు ఊడిపోయాయి. ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి మరమ్మతు, పెయింటింగ్స్ కోసం పెట్టిన ఖర్చు.. ముఖ్యమంత్రి ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువ’ అని ప్రియాంక భాజపా విమర్శలను తిప్పికొట్టారు.

వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు దీన్నొక వివాదం చేస్తున్నారని ఆప్‌ మండిపడింది. ‘ప్రధాని తనను తాను ఫకీర్‌గా అభివర్ణించుకుంటారు. కానీ ఆయన రూ.500 కోట్లతో ఇల్లు నిర్మించుకున్నారు. దాని మరమ్మతులకు భారీగా నిధులు వెచ్చించారు’ అని ఆప్ నేత సంజయ్‌ సింగ్ అన్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని