మండుటెండలో అప్పడం కాల్చిన జవాన్‌.. వీడియో వైరల్‌

మండే ఎండలకు వెరవకుండా విధులు నిర్వర్తిస్తోన్న సైనికులపై అస్సాం ముఖ్యమంత్రి(Himanta Biswa Sarma ) కృతజ్ఞత చాటుకున్నారు. 

Updated : 22 May 2024 23:36 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాల్లో ఆ తీవ్రత ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో ఒక జవాన్ ఇసుకలో అప్పడాన్ని కాల్చుతున్న వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. దీనిని షేర్ చేస్తూ.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(Himanta Biswa Sarma) ఎక్స్‌(ట్విటర్) వేదికగా స్పందించారు.

సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) జవాన్‌ ఒకరు రాజస్థాన్‌లోని బికనేర్ విధులు నిర్వర్తిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో అతడు ఒక అప్పడాన్ని తీసుకొని దానిపై ఇసుక కప్పేశారు. కొద్దిసేపటి తర్వాత, ఇసుకను తొలగించి దానిని తీసి చూస్తే.. అచ్చం స్టవ్‌ మీద వేయించినట్టుగా కనిపించింది. అప్పుడు ఆ ఎడారి ప్రాంతంలో ఉష్ణోగ్రత 47 డిగ్రీల మేర ఉంది. నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న ఈ వీడియో సీఎం హిమంత బిశ్వశర్మ దృష్టిలో పడింది. ‘‘ఎలాంటి అసాధారణ పరిస్థితులకైనా వెరవకుండా, దేశం కోసం సేవలు అందిస్తోన్న జవాన్లను చూసి.. నా హృదయం కృతజ్ఞత, గౌరవంతో నిండిపోయింది’’ అని బీఎస్‌ఎఫ్ ఇండియాను ట్యాగ్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు సైనికులపై తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తంచేస్తున్నారు. హీట్‌వేవ్‌ను పట్టించుకోకుండా సైన్యం తన విధులు నిర్వర్తిస్తోందని కొనియాడారు. రాజస్థాన్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసే ప్రాంతాల్లో బికనేర్ కూడా ఒకటి. ఈసారి అక్కడ 46 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ వెల్లడించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని