Nuh Violence: నూహ్‌లో కొనసాగుతున్న బుల్డోజర్‌ యాక్షన్‌.. మెడికల్‌స్టోర్లు, దుకాణాలు కూల్చివేత

Nuh Violence: అల్లర్లతో ఇటీవల రణరంగంగా మారిన నూహ్‌లో బుల్డోజర్లు నిరంతరంగా నడుస్తున్నాయి. అక్రమ కట్టడాలను అధికారులు శరవేగంగా కూలుస్తున్నారు. ఇవన్నీ అల్లర్లకు కారణమైన నిందితులవేనని తెలుస్తోంది.

Updated : 05 Aug 2023 12:38 IST

గురుగ్రామ్‌: హరియాణా (Haryana)లోని నూహ్‌ (Nuh) జిల్లాలో వరుసగా మూడో రోజు బుల్డోజర్ల (Bulldozer)తో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తావ్‌డూ పట్టణంలో నిన్న అక్రమంగా ఏర్పాటు చేసుకున్న 250 గుడిసెలను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం నల్హార్‌ ప్రాంతంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను పంపించారు.

ఆసుపత్రి వద్ద ఉన్న మెడికల్‌ షాపులు, ఇతర దుకాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అక్రమ కట్టడాలను బుల్డోజర్ల (Bulldozer) సాయంతో తొలగిస్తున్నారు. ఈ ఒక్కరోజే 50 నుంచి 60 నిర్మాణాలను పడగొట్టినట్లు అధికారులు తెలిపారు. అరెస్టులకు భయపడి ఈ దుకాణాదారులు పారిపోయినట్లు చెప్పారు.

నూహ్‌లో 250 గుడిసెల కూల్చివేత

నూహ్‌లో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లు (Violence) తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల అల్లర్లకు పాల్పడిన నిందితులను సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారని, వారు అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లనే ఇప్పుడు నేలమట్టం చేశారని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను పోలీసులు తోసిపుచ్చారు. ఇవన్నీ అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలనేనని, వీటిని తొలగించాలని ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. అల్లర్లకు ఈ కూల్చివేతలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

సీఎం ఆదేశాలతోనే కూల్చివేతలు..!

అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ (Manohar Lal Khattar) ఆదేశాలతో ఈ కూల్చివేతలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లర్లలో పాల్గొన్న వారిని గుర్తించామని, వారి అక్రమ కట్టడాలనే తొలగిస్తున్నామని అధికారులు ధ్రువీకరించినట్లు కొన్ని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సీఎం ఆదేశాలతోనే అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపాయి.

కొండలపై నుంచి కాల్పులు..

నూహ్‌ అల్లర్లు (Nuh Violence) ముందస్తు కుట్రేనని హరియాణా హోంమంత్రి అనిల్‌ విజ్‌ ఆరోపించారు. ఈ విధ్వంసంలో పాల్గొన్న నిందితులు కొండలపై నుంచి కాల్పులు జరిపారని తెలిపారు. కొన్ని భవనాల టెర్రస్‌లపైన రాళ్లను గుర్తించినట్లు చెప్పారు. ఇదంతా చూస్తుంటే హింస ‘ఓ భారీ గేమ్‌ ప్లాన్‌’గా అనిపిస్తోందని ఆరోపించారు. అంతేగాక, ఘర్షణల గురించి తనకు కొన్ని గంటల తర్వాత తెలిసిందని మంత్రి చెప్పడం గమనార్హం. పోలీసులు, ప్రభుత్వ అధికారులెవరూ తనకు సమాచారం ఇవ్వలేదని, ఓ ప్రైవేటు వ్యక్తి తనకు ఫోన్‌ చేసి అల్లర్ల విషయం చెప్పారని ఆయన అన్నారు. ఈ అల్లర్లపై ఇప్పటివరకు పోలీసులు 102 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. దాదాపు 200 మందిని అరెస్టు చేశారు. మరో 80 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు