Rooftop solar scheme: సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు రూ.78వేల వరకు సబ్సిడీ.. ‘సూర్యఘర్‌’కు కేబినెట్‌ ఓకే

Rooftop solar scheme: పీఎం సూర్యఘర్‌ పథకం కింద రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటుచేసుకునేందుకు కుటుంబాలకు రూ.78వేల వరకు సబ్సిడీ అందనుంది. ఈ పథకానికి కేంద్ర కేబినెట్‌ గురువారం ఓకే చెప్పింది.

Updated : 29 Feb 2024 20:14 IST

దిల్లీ: సౌర విద్యుత్‌ (solar power) వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం సరికొత్త పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాని అమలు దిశగా మరో ముందడుగు పడింది. ‘పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన (PM-Surya Ghar: Mufti Bijli Yojna)’కు  కేంద్ర కేబినెట్‌ గురువారం ఆమోదం తెలిపింది. ఈ పథకంతో కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించనుంది.

రూ.75,021 కోట్లతో రూఫ్‌టాప్‌ సోలార్‌ స్కీమ్‌ (Rooftop solar scheme)కు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఈ సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు వెబ్‌సైట్‌లో గృహ వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం దరఖాస్తు ఇలా..

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ఈ పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తరువాత బడ్జెట్‌లోనూ దీనికి కేటాయింపులు చేయగా.. ఫిబ్రవరి 13న ప్రధాని ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్నవారు ఒక కిలోవాట్‌ సోలార్‌ ప్యానళ్లకు రూ.30వేల వరకు సబ్సిడీ పొందొచ్చు. మిగిలినది బ్యాంకు రుణం కల్పిస్తారు. రెండు కిలోవాట్‌లకు రూ.60 వేలు, మూడు అంతకంటే ఎక్కువ కిలోవాట్లకు రూ.78వేలు రాయితీగా ఇస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని