పైరసీకి చెక్‌ పెట్టేలా కేంద్రం కీలక అడుగు.. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు కేబినెట్‌ ఓకే

Cinematography bill: సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. పైరసీని అరికట్టడం, వయసుల వారీ సినిమాల వర్గీకరణలో మార్పులతో సవరణ బిల్లును త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

Updated : 19 Apr 2023 19:54 IST

దిల్లీ: సినిమా పైరసీని (Piracy) అరికట్టే దిశగా కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఇంటర్నెట్‌లో పైరేటెడ్‌ కంటెంట్‌ను అడ్డుకొనేందుకు కొత్తగా సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు 2023ను (Cinematograph Amendment Bill 2023) తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి కేంద్ర కేబినెట్‌ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. తదుపరి సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం U, A, UA పేరిట వయసుల వారీ సినిమా వర్గీకరణ విధానాన్నీ మార్చనున్నట్లు ఠాకూర్‌ తెలిపారు.

సవరణ బిల్లును తీసుకొచ్చే ముందు భాగస్వామ్యపక్షాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు నిర్వహించినట్లు ఠాకూర్‌ వెల్లడించారు. ‘‘పరిశ్రమ కోరుకుంటున్నవన్నీ ఈ బిల్లులో ఉన్నాయి. వారి అంచనాలకు అనుగుణంగా ఈ బిల్లు ఉంటుంది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ బిల్లు సంతృప్తి పరుస్తుంది’’ అని ఠాకూర్‌ చెప్పారు. పైరసీ విషయంలో వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా బిల్లులో కొన్ని నిబంధనలు తీసుకొస్తున్నట్లు ఠాకూర్‌ చెప్పారు. అలాగే, వయసుల వారీ వర్గీకరణ విధానంతో పాటు ప్రస్తుత చట్టంలోని కొన్ని అవసరమైన మార్పులు చేస్తున్నట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఉత్తమ విధానాలకు అనుగుణంగా ఈ బిల్లు ఉండబోతోందని చెప్పారు. బిల్లుకు సంబంధించి ఇంతకు మించిన విషయాలేవీ ఠాకూర్‌ వెల్లడించలేదు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాక దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇటీవల ముంబయిలో జరిగిన ఓ సమావేశంలో సమాచార, ప్రసారాల శాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఇంటర్నెట్‌లో పైరసీ గురించి మాట్లాడారు. దీనిపై త్వరలో ఓ బిల్లును కేంద్రం తీసుకురాబోతోందని చెప్పారు. పైరేటెడ్‌ కంటెంట్‌ను ప్రదర్శించే సైట్లను బ్లాక్‌ చేయబోతున్నట్లు అందులో పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేబినెట్‌ సమావేశంలో జాతీయ క్వాంటమ్‌ మిషన్‌ ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ఇందుకు రూ.6,003.65 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా 2023-24 నుంచి 2030-31 మధ్య ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఈ ఎనిమిదేళ్లలో 50 నుంచి 1,000 ఫిజికల్‌ క్యూబిట్స్‌తో క్వాంటమ్‌ కంప్యూటర్లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మీడియాకు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని