Sandeshkhali: ‘ఆయనపై 43 కేసులు.. మీరు పదేళ్లు బిజీ’: షాజహాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు

షాజహాన్‌ షేక్‌ (Sheikh Shahjahan) బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వేళ కోర్టు తీవ్రంగా స్పందించింది. 

Published : 29 Feb 2024 16:39 IST

కోల్‌కతా: సందేశ్‌ఖాలీ(Sandeshkhali)లో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల్లో ప్రధాన నిందితుడైన టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌(Sheikh Shahjahan)ను పశ్చిమ్ బెంగాల్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆయనపై ఎలాంటి సానుభూతి లేదని స్పష్టం చేసింది.

గురువారం షాజహాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ‘నా క్లైంట్‌ ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురైంది. ఆయన్ను నిన్న రాత్రి అరెస్టు చేశారు’ అని నిందితుడు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ శివజ్ఞానం మాట్లాడుతూ.. ‘ఈ వ్యక్తిపై 43 కేసులు ఉన్నాయి. మరో 10 సంవత్సరాలు ఆయన మిమ్మల్ని బిజీగా ఉంచుతారు. మీరు మళ్లీ సోమవారం రండి. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటోన్న ఈ వ్యక్తిపై ఎలాంటి సానుభూతి లేదు’ అని వ్యాఖ్యానించారు. 

సందేశ్‌ఖాలీలో అకృత్యాలు.. ఎవరీ షాజహాన్‌ షేక్‌..?

షాజహాన్‌పై సస్పెన్షన్‌ వేటు..

ఇదిలాఉంటే  బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మినాఖాలోని ఓ ఇంట్లో బుధవారం షాజహాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈక్రమంలో తృణమూల్ పార్టీ ఆయనపై కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది. అలాగే భాజపాపై విమర్శలు చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా..? అని ప్రశ్నించింది.

ఇదిలా ఉంటే.. ‘రేషన్‌ బియ్యం కుంభకోణం’ కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్‌ ఇంట్లో తనిఖీల కోసం వెళ్లిన ఈడీ బృందంపై ఆయన అనుచరులు గత నెల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తానే మూకను రెచ్చగొట్టానని పోలీసుల విచారణలో ఆయన అంగీకరించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని