Satya Pal Malik: సత్యపాల్‌ మాలిక్ నివాసంలో సీబీఐ సోదాలు

అవినీతి కేసు విచారణలో భాగంగా జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్‌(Satya Pal Malik) నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. 

Updated : 22 Feb 2024 12:13 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌(Satya Pal Malik)కు నివాసంలో సీబీఐ సోదాలు చేపట్టింది. కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు చెందిన అవినీతి కేసులో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 30 ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించినట్టు సమాచారం.

2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ (హెచ్‌ఇపి)లో పనులు కేటాయింపులో అవినీతి జరిగిందని  ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏప్రిల్‌ 2022లో మాలిక్‌తో సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ దర్యాప్తులో భాగంగా గురువారం ఉదయం 100 మంది అధికారులు పలు నగరాల్లో ఈ సోదాలు ప్రారంభించారని సంబంధిత అధికారులు వెల్లడించారు. మాలిక్‌.. 2018 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో తన వద్దకు రెండు దస్త్రాలు వచ్చాయని, వాటిపై సంతకం చేస్తే రూ.300 కోట్లు వస్తాయని తన కార్యదర్శులు చెప్పినట్లు గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక దస్త్రం హైడ్రో ప్రాజెక్టుదని తెలిపారు. 

ఈ సోదాల సందర్భంగా ఆయన ఎక్స్‌ వేదికగా  స్పందించారు. తాను కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ‘నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. నా నివాసంపై నిరంకుశ శక్తులు దాడి చేస్తున్నాయి. ఈ సోదాల ద్వారా నా డ్రైవర్‌, సహాయకుడిని వేధిస్తున్నాయి. ఇలాంటి వాటికి నేను భయపడను. నేను రైతులకు అండగా నిలుస్తాను’ అని వెల్లడించారు. గతంలో  ఓ బీమా పథకం ఒప్పందానికి చెందిన అవినీతి  కేసులో సీబీఐ.. మాలిక్‌ను సాక్షిగా 5 గంటల పాటు విచారించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని