Praful Patel: ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్‌ పటేల్‌కు క్లీన్‌ చిట్‌

ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌కు సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

Published : 28 Mar 2024 19:10 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముంగిట ఎన్సీపీ (అజిత్‌పవార్‌) ముఖ్యనేత ప్రఫుల్‌ పటేల్‌కు ఊరట లభించింది. 2017లో నమోదైన అవినీతి కేసులో ఆయన ప్రమేయం లేదంటూ సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌తోపాటు, ఆ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులపై మే 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. దాదాపు ఏడేళ్లపాటు సుదీర్ఘ విచారణ చేపట్టిన అత్యున్నత దర్యాప్తు సంస్థ.. ఈ కేసుతో ఆయనకు సంబంధం లేదని విచారణను ముగించింది. ఆయనతోపాటు అప్పటి అధికారులకు కూడా క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు సమాచారం. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ప్రఫుల్ పటేల్‌ బరిలోకి దిగుతారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి.

యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రఫుల్‌ పటేల్‌ పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. 2017 మేలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. ప్రఫుల్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడి అప్పటి ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాకు పెద్ద సంఖ్యలో విమానాలను లీజుకు ఇచ్చేందుకు పౌరవిమానశాఖ, ఎయిరిండియా, కొందరు ప్రైవేటు వ్యక్తులతో కలిసి కుట్ర పన్నారన్నది ఆరోపణ. ఓ పక్క ఎయిరిండియా కోసం విమానాల కొనుగోలు జరుగుతుండగానే కొన్నింటిని లీజుకు తీసుకోవడంపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ.. లీజుపై విమానాలను కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందాలు ఆమోదం పొందాయని గుర్తించింది. అయితే, ముందస్తు రద్దు నిబంధనలు లేకపోవడం వల్ల  నేషనల్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెట్‌ (ఎన్‌ఏసీఐఎల్‌) లీజు విమానాలకు అద్దె చెల్లించాల్సి వస్తోందని తేల్చింది. దీనిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపింది. అప్పటి విమానయాన శాఖ అధికారుల సమక్షంలోనే ఒప్పందం జరిగిందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని