Cow attack : బాలికను అమాంతం ఎత్తి పడేసి.. కొమ్ములతో దాడి చేసిన ఆవు

పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ బాలికపై ఆవు దాడి చేసిన ఘటన చెన్నై (Chennai) నగరంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది.

Published : 10 Aug 2023 18:34 IST

Image : senthilkumarane

చెన్నై : పాఠశాల నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న బాలికను ఓ ఆవు కొమ్ములతో దాడి చేసింది. అదే పనిగా పలుమార్లు పొడవటంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. చెన్నైలోని (Chennai) ఇలంగో నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గాంధీనగర్‌లో నివసించే ఆయేషా బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం తన తల్లి, సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తుండగా వారి ముందున్న రెండు ఆవుల్లో ఒకటి వెనక్కి తిరిగి బాలికను కొమ్ములతో ఎత్తిపడేసింది. దాంతో ఆమె కిందపడిపోయింది. అనంతరం ఆవు వెనక్కి తగ్గకుండా పలుమార్లు బాలికపై దాడి చేసింది. దాంతో ఏం చేయాలో పాలుపోని తల్లి ఎవరైనా సహాయం చేయాలని కేకలు వేసింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు రాళ్లు విసిరి ఆ జంతువును నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా అది వెనక్కి తగ్గలేదు. పలుమార్లు పొడిచిన తర్వాత పారిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. 

హిమాచల్ సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

నగరంలో ఆవుల విచ్చలవిడి సంచారంపై చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ జె.రాధాకృష్ణన్ గురువారం మాట్లాడారు. ఆవు దాడి ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. దాడి చేసిన ఆవును పెరంబూరు షెల్టర్‌కు తరలించామని చెప్పారు. పరిస్థితిని తీవ్రంగా పరిగణించి ప్రతి జోన్‌లో రోడ్లపై సంచరిస్తున్న ఆవులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి 15 వాహనాలను ఏర్పాటు చేశామని, ఇప్పటిదాకా పలువురు ఆవుల యజమానులకు రూ.51.75 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించారు. కాగా, ఆవు దాడి ఘటనపై అరుంబాక్కం పోలీసులు కేసు నమోదు చేశారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని