IIT Mandi: హిమాచల్‌ విధ్వంసం.. ఆ విపత్తులకు ‘జీవహింసే’ కారణమట..!

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటానికి జీవహింసే కారణమంటూ ఐఐటీ మండీ డైరెక్టర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Published : 07 Sep 2023 20:19 IST

శిమ్లా: భారీ వర్షాల (Cloudbursts) కారణంగా పోటెత్తిన వరదలు, కొండచరియలు విరిగిపడిన (Landslides) ఘటనలతో ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌ అతలాకుతలమైంది. భారీఎత్తున ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. అయితే, ఈ విపత్తులకు జీవహింసతో ముడిపెడుతూ స్థానిక ఐఐటీ మండీ (IIT Mandi) డైరెక్టర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రజలు మాంసం తింటారని.. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటానికి జంతువులపై క్రూరత్వమే కారణమంటూ చెప్పడం వివాదాస్పదంగా మారింది. అంతటితో ఆగకుండా మాంసాహారం తినబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

‘జంతువులను వధించడం ఆపకపోతే.. హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితులు మరింత దిగజారతాయి. పర్యావరణ క్షీణతతో దానికి సంబంధం ఉంది. స్థానికంగా కొండచరియలు విరిగిపడటం, మేఘవిస్ఫోటాలు ఇవన్నీ.. జంతువులపై క్రూరత్వం ప్రభావాలే. ప్రజలు మాంసం తింటారు. అయితే, మంచి మనుషులుగా మారేందుకు మాంసాన్ని త్యజించాలి’ అని ఐఐటీ మండీ డైరెక్టర్ లక్ష్మీధర్ బెహరా విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భారత్‌లోనే అతి పొడవైన గాజు వంతెన చూశారా?

ఇదిలా ఉండగా.. బెహరా తన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో తన స్నేహితుడి అపార్ట్‌మెంట్‌లోంచి దుష్టశక్తులను పారదోలేందుకు భూతవైద్యంలో పాల్గొన్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించి వార్తల్లో నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని