8 ఏళ్ల జీతం 4 వారాల్లో తిరిగివ్వాలా?.. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తాం: మమత

Mamata Banerjee on HC order: ఉపాధ్యాయ నియామక పరీక్ష రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తామని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Updated : 22 Apr 2024 16:26 IST

Mamata Banerjee | కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ద్వారా నియమితులైన 26 వేల మంది ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. ఉద్యోగాలను రద్దు చేయడంతో పాటు..  వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమత పాల్గొన్నారు. ఈసందర్భంగా కోర్టు తీర్పుపై మీడియాతో మాట్లాడారు. ‘‘ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధం. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలబడతాం. వారికి న్యాయం జరిగేవరకు పోరాడతాం. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తాం. ఉద్యోగాలు కోల్పోయిన వారు అధైర్యపడొద్దు’’ అని మమత అన్నారు. పైగా 8 ఏళ్ల వేతనాన్ని కేవలం 4 వారాల గడువులో చెల్లించడం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. కొందరు భాజపా నేతలు న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారంటూ ఆరోపించారు.

బెంగాల్‌లో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు.. జీతాలు వెనక్కి ఇవ్వాలన్న కోర్టు

వాళ్లకెలా తెలిసింది?

భాజపా నేత సువేందు అధికారి పార్టీ కార్యకర్తలతో ఇటీవల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సోమవారం వరకు వేచి చూడండి.. కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. దాంతో ఆ పార్టీ ఇక కోలుకోలేదు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ మమత.. కోర్టు తీర్పు రాకముందే వారికెలా తెలిసిందంటూ మమత ప్రశ్నించారు. తాను చేసిన వ్యాఖ్యలపై సువేందు అధికారి వివరణ ఇచ్చారు. ఆ పార్టీలో తిరుగుబాట్లు, అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అలా అన్నానని వివరణ ఇచ్చారు. మరోవైపు కోర్టు ఇచ్చిన తీర్పును ఆ పార్టీ స్వాగతించింది. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగిందని పేర్కొంది.

ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్‌ సి, గ్రూప్‌ డి స్టాఫ్‌ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్‌ సర్కారు రాష్ట్రస్థాయి సెలక్షన్‌ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేశారు. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌ (SLST) నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టంచేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక, దీని కింద ఉద్యోగాలు దక్కించుకున్న టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని