Election Manifesto: మ్యానిఫెస్టోలో వాగ్దానాలను ‘అవినీతి’గా పరిగణించలేం - సుప్రీంకోర్టు

ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసే వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టు (Supreme Court) అభిప్రాయపడింది.

Published : 27 May 2024 20:15 IST

దిల్లీ: రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసే వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందకు రావని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) పేర్కొంది. అవి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు ఆర్థిక సహాయం చేసినట్లు అవుతుందని, అంతేకాకుండా పార్టీ అభ్యర్థి కూడా అవినీతి చేయడంతో సమానమని పిటిషనర్‌ చేసిన వాదనను తోసిపుచ్చింది. ఈ వాదన విచిత్రంగా ఉందని అభిప్రాయపడిన జస్టిస్‌ సూర్యకాంత, జస్టిస్‌ వీకే విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం.. తగిన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. రాజకీయ పార్టీల ‘ఉచితాలు’ (Freebies)కు సంబంధించిన ఓ కేసు సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది.

కర్ణాటకలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. చామరాజనగర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బీ జెడ్‌ జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ గెలుపొందారు. అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు అవినీతి కిందకే వస్తాయని, అందుకే ఆ పార్టీ నుంచి గెలుపొందిన జమీర్‌ను పక్కన పెట్టాలని కోరుతూ శశాంక జె. శ్రీధర అనే ఓటరు స్థానిక హైకోర్టును ఆశ్రయించాడు.

‘ఉచితాలు’ సరే.. నిధుల మాటేంటి?

దీనిపై విచారించిన కర్ణాటక హైకోర్టు.. తాము అమలు చేయాలనుకుంటున్న విధానాల గురించి ఏదైనా పార్టీ ప్రకటించడాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123 కింద అవినీతిగా పరిగణించలేమని పేర్కొంది. వాటిని సంక్షేమ విధానాలుగానే చూడాలని, ఆర్థికపరంగా అవి సరైనవేనా, కాదా అనేది వేరే విషయమని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ శశాంక సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆయన వాదనను తోసిపుచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు