‘ఉచితాలు’ సరే.. నిధుల మాటేంటి?

ఉచితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీన్ని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది.

Updated : 05 Oct 2022 06:53 IST

రాజకీయపార్టీలకు కొత్తగా ప్రొఫార్మాను ప్రతిపాదించిన ఎన్నికల సంఘం
ఆ మేరకు ప్రవర్తనా నియమావళికి సవరణ
19లోపు అభిప్రాయాలు చెప్పాలని లేఖ

ఈనాడు, దిల్లీ: ఉచితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీన్ని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. ఇందుకు వీలుగా రాజకీయపార్టీలు తాము చేసే వాగ్దానాల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తాయో స్పష్టంగా చెప్పేలా ఒక ప్రొఫార్మాను నిర్దేశిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిలో సవరణలు ప్రతిపాదించాలని నిర్ణయించింది. దీనిపై అన్ని రాజకీయపార్టీలు ఈనెల 19వ తేదీలోపు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఒకవేళ స్పందించకపోతే ఇక చెప్పడానికి ఏమీలేదని రాజకీయపార్టీలు అనుకుంటున్నట్లు భావించాల్సి వస్తుందని పేర్కొంది. ఎన్నికల మేనిఫెస్టోలను నియంత్రించడానికి ప్రత్యేక చట్టం లేకపోయినప్పటికీ రాజకీయపార్టీలతో మాట్లాడి దానిపై ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని సుబ్రహ్మణ్యం బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఇందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో మేనిఫెస్టోల కోసం నిర్దేశించిన పార్ట్‌-8, సబ్‌ పేరా 3(3)కి కొత్తగా ఒక ప్రొఫార్మాను జతచేయాలి. అందులో వాగ్దానాల అమలుకయ్యే ఖర్చెంత, దానివల్ల ఎంతమందికి ప్రయోజనం దక్కుతుంది, అందుకోసం ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకుంటారు? అన్న వివరాలను సేకరించాలని నిర్ణయించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకున్న బడ్జెట్‌ పరిమితులకు లోబడి వాగ్దానాలు అమలు చేయడానికున్న సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి వీలుగా ప్రొఫార్మాను రూపొందించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఎన్ని వాగ్దానాలు చేశారు? వాటి పేర్లు

వాగ్దానాల అమలుకోసం చేసే ఖర్చు వల్ల ఎంతమందికి ప్రయోజనం కలుగుతుంది? (ఉదాహరణకు వ్యక్తులు, కుటుంబాలు, కమ్యూనిటీ, దారిద్య్రరేఖకు దిగువనున్నవారు లేదంటే మొత్తం జనాభాకు)

భౌతికంగా లబ్ధిదారుల సంఖ్య ఎంత?

ఒక్కో లబ్ధిదారుకోసం ఎంత ఖర్చవుతుంది?

మొత్తం ఎంత ఖర్చవుతుంది?

ఈ వాగ్దానాల అమలుకోసం అదనపు ఆర్థిక వనరులు ఎలా సేకరిస్తారు?

బడ్జెట్‌ నుంచి కాకుండా ఇతరత్రా మార్గాల నుంచి వనరులు ఎలా సమకూర్చుకుంటారు? ఇప్పుడున్న పన్ను రేట్లు పెంచుతారా? లేదంటే కొత్త పన్నులు వేస్తారా? పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ వంటివి చేస్తారా?

రెవెన్యూ వ్యయం (వడ్డీ ఖర్చులు మినహాయించి), మూలధన వ్యయాన్ని ఎలా హేతుబద్ధీకరిస్తారు?

అదనపు రుణాలు ఎంత అవసరం అవుతాయి?

ఆ సంవత్సరం జీడీపీ, జీఎస్‌డీపీ ఎంత?

వాగ్దానాల అమలు వల్ల ఆర్థిక స్థిరత్వంపై పడే ప్రభావం ఎంత?

కొత్తగా చేసే అప్పులు జీఎస్‌డీపీ/జీడీపీలో ఎంతమేరకు ఉంటాయి?

దానివల్ల రుణం-జీఎస్‌డీపీ/జీడీపీ నిష్పత్తి ఎంతకు చేరుతుంది? అన్న వివరాలను రాజకీయపార్టీలు ఇవ్వాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది.

ప్రొఫార్మాను ఎ, బి భాగాలుగా విభజించామని, పార్ట్‌-బిలో ఒక భాగాన్ని అసెంబ్లీ ఎన్నికలకైతే  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు ఎన్నికలకైతే కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్నికల సంవత్సరంలో ఉన్న సాధారణ బడ్జెట్‌ అంచనాల ప్రకారం భర్తీచేసి జారీచేయాలని పేర్కొంది.

ఇందులో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలకున్న పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌, ఇతర ఆదాయ వివరాలు, రెవెన్యూ వ్యయం, అందులో వడ్డీ చెల్లింపుల కోసం చేసే ఖర్చులు, ఇతరత్రా వివరాలు, మూలధన వ్యయం వివరాలు ఇవ్వాలని ప్రతిపాదించింది. అలాగే ఆ ఏడాదికున్న నికర రుణాలు, ఈ వివరాలు సమర్పించేనాటికి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న మొత్తం అప్పుల వివరాలు తెలపాలని పేర్కొంది. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలకున్న ఆర్థిక సుస్థిరత శక్తి, జీడీపీ/జీఎస్‌డీపీలో స్థూల ఆర్థిక లోటు ఎంత? రుణం-జీడీపీ/జీఎస్‌డీపీ నిష్పత్తి ఎంతవరకు ఉందన్న వివరాలనూ ఈ అధికారులు పొందుపరచాల్సి ఉంటుందని వెల్లడించింది.


పన్నుల సొమ్ము స్నేహితుల లబ్ధికోసం కాదు: ఆప్‌

న్నుచెల్లింపు దారుల సొమ్మును ప్రభుత్వం ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు వెచ్చించాలని, రాజకీయ నాయకులు, వారి కుటుంబసభ్యులకు ప్రయోజనం చేకూర్చేందుకు కాదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మంగళవారం పేర్కొంది. ప్రజలకు విద్యుత్తు సౌకర్యం, నీరు, పాఠశాలలు, ఇతర సౌకర్యాలు సమకూర్చడం ఏ ప్రభుత్వానికైనా ప్రధాన బాధ్యతని స్పష్టంచేసింది. రాజకీయపార్టీలు తాము చేసే వాగ్దానాల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తాయో స్పష్టంగా చెప్పేలా ఎన్నికల ప్రవర్తన నియమావళిలో సవరణలను ప్రతిపాదించాలని  ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో ఆప్‌ జాతీయ అధికార ప్రతినిధి ఆతిశీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని