PM Modi: పాక్‌ సానుభూతి పార్టీలు దేశాన్ని భయపెట్టే పనిలో ఉన్నాయి: ప్రధాని మోదీ

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. వారు పాకిస్థాన్‌ సానుభూతిపరులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Updated : 22 May 2024 17:48 IST

లఖ్‌నవూ: పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ దేశ ప్రజలను భయపెట్టేందుకు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆరోపించారు. ఆ రెండు పార్టీలు పాక్‌కు సానుభూతిపరులు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

2017లో యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ప్రచారం చేసిన ఈ రెండు పార్టీలు (కాంగ్రెస్‌, ఎస్పీ) ఓటమి చవిచూశాయని.. ప్రస్తుతం మళ్లీ అవి కలిసి ప్రచారం చేయడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని ప్రధాని ఎద్దేవా చేశారు. ‘‘ఒకప్పుడు ఉగ్రవాదం పేరుతో మనల్ని బెదిరించినవారు ప్రస్తుతం ఆహార ధాన్యాల కోసం అల్లాడుతున్నారు. పాకిస్థాన్‌ పని అయిపోయింది. కానీ, ఆ దేశ సానుభూతిపరులైన ఎస్పీ, కాంగ్రెస్‌లు మాత్రం దేశాన్ని భయపెట్టే పనిలో బిజీగా ఉన్నాయి’’ అని మోదీ ఆరోపించారు.

నా వ్యక్తిగత ఫొటోలు లీక్‌ చేసేందుకు కుట్రలు: స్వాతి మాలీవాల్‌ సంచలన ఆరోపణలు

ఇది బలహీన ప్రభుత్వం కాదు.. మోదీ సర్కార్‌

‘‘పాక్‌ వద్ద అణు బాంబులున్నాయని మనం భయపడాలని వారు అంటున్నారు. ఈ 56 అంగుళాల ఛాతీ (మోదీని ఉద్దేశిస్తూ) గురించి వారికి తెలియదా? ఇది వారి బలహీన కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు.. బలమైన మోదీ సర్కార్‌. మనల్ని బెదిరించాలని ప్రయత్నించే వారిని భారత్‌ వదిలిపెట్టదు. వారి దేశంలోకి వెళ్లి మరీ వాళ్ల అంతు చూసింది’’ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చాక.. అగ్నివీర్‌ చెత్త బుట్టలోకే: రాహుల్

మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను గద్దె దించి అధికారం చేజిక్కించుకునేందుకు ఇండియా కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. మోదీ సర్కార్‌ ప్రవేశపెట్టిన అగ్నివీర్‌ పథకంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘‘అగ్నివీర్.. ఆర్మీ పథకం కాదు. ఇది మోదీ పథకం. దీని అవసరం భారత సైన్యానికి లేదు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని చెత్తబుట్టలో పడేస్తాం. దేశ సరిహద్దులకు మన యువత రక్షణ కల్పించగలదు. వారి నరనరాల్లో దేశభక్తి ప్రవహిస్తోంది. దేశ సైనికులను కూలీలుగా మార్చేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారు’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని