Swati Maliwal: నా వ్యక్తిగత ఫొటోలు లీక్‌ చేసేందుకు కుట్రలు: స్వాతి మాలీవాల్‌ సంచలన ఆరోపణలు

Swati Maliwal: తన వ్యక్తిగత ఫొటోలు లీక్‌ చేసేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆర్మీ కుట్రలు పన్నుతోందని రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌ ఆరోపించారు. తనపై నకిలీ స్టింగ్‌ ఆపరేషన్‌ జరగొచ్చని అన్నారు.

Published : 22 May 2024 12:47 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal)పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ (Kejriwal PA Bibhav Kumar) దాడికి పాల్పడిన ఘటన రాజకీయంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఆప్‌ నేతలు ప్రయత్నిస్తున్నారన్న స్వాతి తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత ఫొటోలు లీక్‌ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు.

‘‘ఆప్‌ (AAP) సీనియర్‌ నేత ఒకరు నిన్న నాకు కాల్‌ చేశారు. స్వాతిపై అభ్యంతరకర ఆరోపణలు చేయాలంటూ పార్టీలోని ప్రతి ఒక్కరిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు చెప్పారు. నా వ్యక్తిగత ఫొటోలను లీక్‌ చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు సదరు నేత తెలిపారు. నాకు మద్దతుగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారట. నాకు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు నిర్వహించేందుకు కొందరిని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసే బాధ్యతను ఇంకొందరికి అప్పగించారు. రిపోర్టర్లను కొట్టి నాపై నకిలీ స్టింగ్‌ ఆపరేషన్లు చేయించాలని చూస్తున్నారు’’ అని స్వాతి ఆరోపించారు.

నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు

‘‘నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై కోపం లేదు. నిందితుడు చాలా శక్తిమంతమైన వ్యక్తి. పార్టీలో బడా నేతలు కూడా అతడికి భయపడతారు. అతడిని ఎదిరించి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఇవన్నీ నన్ను బాధించట్లేదు. కానీ, దిల్లీ (Delhi) మహిళా మంత్రి (ఆతిశీ) కూడా నవ్వుతూ నన్ను అవమానిస్తున్నారు. మీరు వేల మంది సైన్యాన్ని దించినా నేను ఒంటరిగా ఎదుర్కొంటా. ఎందుకంటే నిజం నావైపు ఉంది. నా ఆత్మగౌరవం కోసం ఈ పోరాటం మొదలుపెట్టా. న్యాయం జరిగే వరకు కొనసాగిస్తా. నేను ఒంటరి కావొచ్చు.. ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టను’’ అని ఆమె రాసుకొచ్చారు.

సీఎం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నివాసంలోనే ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు (Swati Maliwal Assault Case)లో అరెస్టయిన బిభవ్‌ను దిల్లీ పోలీసులు నిన్న ముంబయి తీసుకెళ్లారు. అక్కడ అతడి ఐఫోన్ డేటాను రికవర్‌ చేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. సీఎం నుంచి నివాసం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న నిందితుడు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సీసీటీవీ రికార్డులను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని