Congress: ఎన్నికల బాండ్లపై సీతారామన్‌ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్‌

ఎన్నికల బాండ్ల పథకం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేసిన ప్రకటనను హస్తం పార్టీ ఖండించింది. 

Published : 20 Apr 2024 18:46 IST

దిల్లీ: కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే.. ఎన్నికల బాండ్ల పథకాన్ని (electoral bonds scheme) పునరుద్ధరిస్తామంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది.

‘‘సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు ఇచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని తాము తిరిగి అధికారంలోకి వస్తే.. మళ్లీ తీసుకువస్తామని కేంద్రమంత్రి సీతారామన్ ప్రకటించారు. ‘పే పీఎం స్కామ్’ కింద భాజపా రూ.4 లక్షల కోట్లు దోచుకున్న విషయం మనకు తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఆ దోపిడీని కొనసాగించాలనుకుంటున్నారు. ఈసారి ఎంత దోచుకుంటారో..? అందుకే ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి. అదృష్టవశాత్తూ ఈ అవినీతి దళం బయటకు వెళ్లిపోతుందని క్షేత్రస్థాయి నివేదికలు వెల్లడిస్తున్నాయి’’ అని కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్‌ విమర్శలు గుప్పించారు.

అమిత్ షాకు సొంత కారు లేదట..

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల (electoral bonds scheme) చెల్లుబాటుపై సుప్రీంకోర్టు (Supreme court) ఫిబ్రవరిలో సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈమేరకు సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగీవ్ర తీర్పునిచ్చింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంది. విరాళాలు ఇచ్చినవారి పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని