Congress: ముందైతే ఒక యాపిల్‌ తీసుకురండి.. నెహ్రూపై షా వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ కౌంటర్‌

కశ్మీర్‌ దుస్థితికి భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కారణమంటూ కేంద్రమంత్రి అమిత్ షా లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల్లోపు పీవోకేను వెనక్కి తీసుకురావాలంటూ డిమాండ్‌ చేసింది.

Published : 07 Dec 2023 17:27 IST

దిల్లీ: లోక్‌సభలో పాక్‌ ఆక్రమిత్‌ కశ్మీర్‌ (పీవోకే) అంశాన్ని ప్రస్తావిస్తూ భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ (Jawaharlal Nehru)పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah)చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ (Congress)మండిపడింది. కశ్మీర్‌ దుస్థితికి నెహ్రూ చేసిన రెండు తప్పిదాలే కారణమంటూ షా వ్యాఖ్యానించడాన్ని పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. పీవోకే కంటే ముందు అక్కడి నుంచి ఒక యాపిల్‌ను తీసుకురండి అంటూ సవాల్‌ విసిరింది.

అమిత్‌ షా దివంగత నేత నెహ్రూపై చేసిన వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌదరి (Adhir Ranjan Chowdhury) ఘాటుగా స్పందించారు. ‘‘పీవోకే అంశంపై ఒక రోజంతా కచ్చితంగా చర్చ జరపాలి. అమిత్‌ షా చెబుతునట్లు నెహ్రూ తప్పు చేశారనే అనుకుందాం. అయితే, 2019లో పీఓకేని వెనక్కి తీసుకువస్తామని కేంద్రంలోని భాజపా హామీ ఇచ్చింది. మరి.. పీఓకేను తీసుకోకుండా మిమల్ని అడ్డుకున్నదెవరు?’’ అంటూ ప్రశ్నించారు.

అది చాయ్‌ సమోసా మీటింగే.. ఇండియా కూటమిపై జేడీయూ నేత వ్యంగ్యాస్త్రాలు

పీఓకే మీదుగా అనుసంధాన కారిడార్‌ ఏర్పాటు చేసిన సీపెక్‌ (చైనా-పాకిస్థాన్‌ ఎకానమిక్‌ కారిడార్‌) ప్రాజెక్ట్‌ నిర్మాణం కొనసాగుతోంది. ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని దుయ్యబట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల లోగా పీఓకేను వెనక్కి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అలా జరిగితే దేశంలోని అన్ని ఓట్లను భాజపానే పొందవచ్చన్నారు.

పీవోకేను వెనక్కి తీసుకురావడం అంటుంచి కనీసం ముందైతే ఒక యాపిల్‌ను తీసుకురండి అంటూ సవాల్‌ విసిరారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కానీ.. చేతల్లో మాత్రం వాటిని నిరూపించుకోలేరు అంటూ ఎద్దెవా చేశారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు, జమ్మూ కశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లులను కేంద్రం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. సభ వీటిని ఆమోదించిన అనంతరం అమిత్‌ షా మాట్లాడుతూ నెహ్రూపై కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ మొత్తాన్ని గెలుచుకోక ముందే నెహ్రూ కాల్పుల విరమణ ప్రకటించడం ఒక తప్పైతే.. అక్కడి ప్రజల బాధలను ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లకపోవడం మరో తప్పిదమంటూ ఆరోపించారు. మూడు రోజుల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించి ఉంటే నేడు పీవోకే మన దేశంలో భాగమై ఉండేదని షా అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని