Bihar: అది చాయ్‌ సమోసా మీటింగే.. ఇండియా కూటమిపై జేడీయూ నేత వ్యంగ్యాస్త్రాలు

ఇండియా కూటమి సమావేశాలను ప్రస్తావిస్తూ జేడీయూ ఎంపీ సునీల్‌ కుమార్‌ పింటు వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. కూటమి సమావేశాలను చాయ్‌ సమోసా మీటింగ్‌లంటూ ఎద్దేవా చేశారు. 

Published : 07 Dec 2023 15:18 IST

పట్నా: మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi)ని ప్రశంసించిన జేడీయూ నేత సునీల్‌ కుమార్‌ పింటు (Sunil Kumar Pintu) తాజాగా ఇండియా కూటమిపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఆ కూటమిలోని పార్టీల ఐక్యతను ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పార్టీల మధ్య విభేదాలను ఎత్తిచూపారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై సునీల్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘‘పార్టీల మధ్య సీట్ల పంపిణీ విషయంలో అవగాహన రానంత వరకు అది చాయ్‌-సమోసా మీటింగ్‌ మాత్రమే అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే మరోసారి ప్రధాని మోదీని కొనియాడారు. ప్రధాని వాస్తవాలను మాత్రమే చెబుతారని.. అందుకే ప్రజలు ఆయన్ను విశ్వసిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

ఆయన కోరితే.. రాజీనామాకు సిద్ధం

గతేడాది భాజపాతో తెగతెంపులు చేసుకున్న జేడీయూ ఎన్డీయే కూటమి నుంచి బయటకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో భాజపానే తనని జేడీయూలోకి పంపిందని సునీల్‌ తెలిపారు. తాను ఇప్పటికీ భాజపా మనిషినని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జేడీయూతో కొనసాగలేనని.. ఆ పార్టీ గుర్తుపై పోటీ చేయడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ కోరిన వెంటనే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

‘ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు’: భారత్‌-అమెరికా రిలేషన్‌షిప్‌పై గార్సెట్టి వ్యాఖ్య

ఇదిలా ఉండగా.. ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘‘ఈ గెలుపు ప్రధాని మోదీతోనే సాధ్యమైంది’’ అంటూ సునీల్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఆయనపై జేడీయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలు జరగకముందే తన ఎంపీ పదవికి సునీల్‌ రాజీనామా చేయాలని ఆ పార్టీ ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు