కేరళ రాజకీయాల్లో మళ్లీ స్మగ్లింగ్‌ కలకలం.. అరకేజీ బంగారంతో చిక్కిన శశిథరూర్‌ పీఏ

Gold Smuggling: కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సహాయకుడు బంగారం అక్రమ రవాణా చేస్తూ కస్టమ్స్‌ అధికారులకు చిక్కాడు. దీనిపై ఎంపీ స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

Updated : 30 May 2024 17:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళ రాజకీయాల్లో మరోసారి బంగారం స్మగ్లింగ్‌ (Gold Smuggling) ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే ఈ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ శశిథరూర్‌ సహాయకుడు (Shashi Tharoor's aide) బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్‌ అధికారులకు చిక్కడం కలకలం రేపుతోంది.

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi Airport)లో బుధవారం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కన్పించడంతో కస్టమ్స్‌ అధికారులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. తనిఖీలు చేయగా వారి వద్ద 500 గ్రాములకు పైగా బరువున్న మందపాటి బంగారపు గొలుసును గుర్తించారు. దాని విలువ దాదాపు రూ.35లక్షలు ఉంటుందని తెలిపారు. దీనికి సరైన పత్రాలు చూపించనందున అధికారులు వారిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు ఎంపీ శశిథరూర్‌ సహాయకుడు (Tharoor Aide) శివ కుమార్‌ ప్రసాద్‌ అని అధికారులు తెలిపారు. అతడి వద్ద ఏరోడ్రోమ్‌ ఎంట్రీ పర్మిట్‌ ఉందని పేర్కొన్నారు. అది ఎంపీ ప్రోటోకాల్‌ బృందంలో భాగంగా తీసుకున్నాడా? అనే కోణంలో పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

థరూర్‌ ఏమన్నారంటే..?

తాజా పరిణామాలపై శశిథరూర్‌ (Shashi Tharoor) ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘ఎన్నికల ప్రచారం నిమిత్తం ధర్మశాలలో ఉండగా ఈ విషయం తెలిసి షాకయ్యా. అతడు గతంలో నా దగ్గర పనిచేశాడు. ఉద్యోగం నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న ఆ 72 ఏళ్ల వ్యక్తి తరచూ డయాలసిస్‌ చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే మానవతా దృక్పథంతో పార్ట్‌ టైం కింద మళ్లీ విధుల్లోకి తీసుకున్నా. ఎయిర్‌పోర్టు ఫెసిలిటేషన్‌ విషయంలో నాకు అసిస్టెంట్‌గా సేవలు అందిస్తున్నాడు. అయితే ఇలాంటి తప్పులను క్షమించను. ఈ కేసు దర్యాప్తు కోసం అధికారులకు అన్ని విధాలా సహకరిస్తాను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అని థరూర్‌ రాసుకొచ్చారు.

పుణె కారు ఘటన.. బాలుడి రక్త నమూనా స్థానంలో తల్లిది తీసుకొని..!

ఈ వ్యవహారం కేరళ (Kerala News) రాజకీయాల్లో దుమారం రేపింది. తాజా ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి థరూర్‌పై పోటీ చేసిన కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ దీనిపై స్పందిస్తూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘అంతకుముందు సీఎం సెక్రటరీ బంగారం స్మగ్లింగ్‌లో చిక్కారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ఎంపీ సహాయకుడు/పీఏ (Congress MP Shashi Tharoor's aide)ను అరెస్టు చేశారు. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలైన సీపీఎం, కాంగ్రెస్‌.. పసిడి అక్రమ రవాణాలోనూ భాగస్వాములయ్యాయి’’ అని దుయ్యబట్టారు.

2020లో దుబాయ్‌ నుంచి తిరువనంతపురం వచ్చిన యూఏఈ దౌత్యకార్యాలయ సిబ్బంది బ్యాగుల్లో 30 కిలోల బంగారం బయటపడిన సంగతి తెలిసిందే. ఆ బ్యాగును కేరళ సీఎం పనరయి విజయన్‌ స్వయంగా నిర్వహించే ఐటీశాఖలో ఓ ప్రాజెక్టులో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేసిన స్వప్నా సురేశ్‌ తెప్పించినట్లు తేలింది. అయితే, ఈ స్మగ్లింగ్‌ (Gold Smuggling) వెనుక సీఎం, ఆయన కుటుంబసభ్యులకూ భాగం ఉందంటూ ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు