PM Modi: మహాత్మా గాంధీపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్‌

జాతిపిత గాంధీపై సినిమా తీసేవరకు ఆయన గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదంటూ ఒక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Published : 29 May 2024 22:26 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నిక సమరంలో ఇంకా చివరిదశ పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన జాతిపిత గాంధీపై సినిమా తీసేవరకు ఆయన గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదంటూ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశమయ్యింది. అంత గొప్ప భారతీయుడి గురించి ప్రపంచానికి తెలియజేసే బాధ్యత దేశ నాయకులపై ఉందన్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. మహాత్ముడి వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించింది.

ఆయన జీవితం, సిద్ధాంతాల గురించి తీసిన సినిమా ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీకి గుర్తింపు అనేది ప్రభావం చూపింది. ఒకవేళ మార్టిన్ లూథర్‌ కింగ్, నెల్సన్ మండేలా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులైతే.. గాంధీని కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తిగా మార్చేందుకు మెరుగ్గా పనిచేసి ఉండాల్సింది అని అన్నారు. ఎన్నో దేశాలు చుట్టివచ్చిన తర్వాత.. మహాత్ముడిపై మరింత దృష్టి సారించి ఉంటే బాగుండేదని అనిపించిందన్నారు. మనదేశంలో ఎన్నో సమస్యలకు ఆయన వద్ద పరిష్కారం ఉందన్నారు.

మహాత్ముడిపై మోదీ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌.. ప్రధాని తీరుపై మండిపడింది. మహాత్మా గాంధీ వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించింది. వారణాసి, దిల్లీ, అహ్మదాబాద్‌లో గాంధీ పేరుతో ఉన్న సంస్థలను కేంద్ర ప్రభుత్వమే ధ్వంసం చేసిందని విమర్శిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్వీట్‌ చేశారు.

మహాత్ముడి జీవితం ఆధారంగా 1982లో ‘గాంధీ’ చిత్రం వచ్చింది. రిచర్డ్ అటెన్‌బరో దానికి దర్శకత్వం వహించారు. బెన్‌ కింగ్స్లే.. గాంధీ పాత్రలో జీవించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు , ఉత్తమ నటుడుతో సహా పలు విభాగాల్లో అకాడమీ అవార్డును సొంతం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని