Congress: కాంగ్రెస్‌కు ఇద్దరు నేతలు రాజీనామా..!

కాంగ్రెస్‌కు ఇద్దరు ముఖ్య నేతలు రాజీనామా చేశారు. వీరిలో ఉత్తరముంబయి మాజీ ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌, పార్టీ అధికారిక ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ ఉన్నారు.  

Updated : 04 Apr 2024 10:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ (Congress) అధికారిక ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ గురువారం పార్టీని వీడారు. ఆయన తన లేఖను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ప్రస్తుతం పార్టీ ఏ దిశకు వెళుతోందో కూడా తెలియడంలేదు. ఇది నాకు ఇబ్బందికరంగా మారింది. నేను సనాతనానికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేను.. సంపద సృష్టికర్తలను నిందించలేను. నేను పార్టీలో అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. 

పార్టీ క్షేత్రస్థాయిలో బాగా దెబ్బతిందని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కార్యకర్తలకు నాయకులకు మధ్య గ్యాప్‌ను పూరించడం కష్టంగా మారిందన్నారు. కిందిస్థాయిలోని వారు తమ నాయకులకు నేరుగా సలహాలు ఇవ్వలేనప్పుడు ఎటువంటి సానుకూల మార్పు సాధ్యంకాదని తెలిపారు. గౌరవ్‌ 2023లో రాజస్థాన్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 

నా రాజీనామా లేఖ చూశాకే కాంగ్రెస్‌ చర్యలు తీసుకొంది..: సంజయ్‌

మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్‌) వర్గంతో సీట్ల సర్దుబాటుపై అసంతృప్తిగా ఉన్న సీనియర్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌పై కాంగ్రెస్‌ పార్టీ నిన్న రాత్రి ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ పార్టీకి రాజీనామా లేఖను పంపిన తర్వాతే చర్యలు తీసుకొన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖ ఈమెయిల్‌ కాపీ స్క్రీన్‌ షాట్‌న షేర్‌ చేశారు. ఈ అంశంపై నేడు మాట్లాడతానని పేర్కొన్నారు. సంజయ్‌ గతంలో ఉత్తర ముంబయి నుంచి ఎంపీగా గెలిచారు. ఈ స్థానానికి  శివసేన (ఉద్ధవ్‌) వర్గం అభ్యర్థిని ప్రకటించడంతో ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌పై విమర్శలు మొదలుపెట్టారు. ముంబయిలో ఆ పార్టీ చర్యలను ఆమోదిస్తూ పోతే.. కాంగ్రెస్‌ దెబ్బతింటుందని హెచ్చరించారు. మరో వైపు హస్తం పార్టీ కూడా సంజయ్‌ పేరును స్టార్‌ ప్రచారకుల జాబితా నుంచి తొలగించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని