Congress: బిగ్‌బీ తర్వాత కాంగ్రెస్‌ బిగ్‌ విన్‌.. 40 ఏళ్ల నిరీక్షణకు తెర

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ నియోజకవర్గం నాలుగు దశాబ్దల అనంతరం కాంగ్రెస్‌కు దక్కింది. 

Updated : 11 Jun 2024 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భాజపాకు మంచి పట్టున్న ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా వెలువడిన సంగతి తెలిసిందే. 40కి పైగా స్థానాల్లో ఇండియా కూటమి విజయ పతాకం ఎగురవేసింది. అలహాబాద్‌ (Allahabad) స్థానాన్ని సొంతం చేసుకునేందుకు కొన్ని దశాబ్దాలుగా హస్తం పార్టీ పడిన శ్రమకు ఈ ఎన్నికల్లో ఫలితం దక్కింది. ఆ స్థానాన్ని గెలుచుకోవడంతో 40 ఏళ్లుగా కాంగ్రెస్‌ చేసిన నిరీక్షణకు తెర పడినట్లయింది.

1984లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో.. కాంగ్రెస్‌ తరఫున బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) అలహాబాద్‌లో పోటీకి దిగారు. ఇది ఆయన జన్మస్థానం కూడా కావడం గమనార్హం. నాడు ఎన్నికల్లో అమితాబ్‌ గెలుపొందారు. మూడేళ్లు ఎంపీగా వ్యవహరించిన ఆయన ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో వీపీ సింగ్‌ ఎన్నికయ్యారు.

చేజారిన స్థానంపై పట్టుకు..

ఆ తర్వాత ఎన్నికల్లో ఈ స్థానం హస్తం పార్టీ చేజారింది. దానిపై మళ్లీ పట్టు కోసం తీవ్రంగా యత్నించింది. భాజపాకు ధీటుగా ఉజ్వల్‌ రమణ్‌సింగ్‌ను ఎన్నికల బరిలో దించింది. గెలుపే లక్ష్యంగా పనిచేసిన ఆయన.. భాజపా అభ్యర్థి నీరజ్‌ త్రిపాఠిపై 58 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన గెలుపుతో నాలుగు దశాబ్దాల తర్వాత ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకొంది.

కేంద్ర క్యాబినెట్‌కు రాజీనామా వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సురేశ్‌ గోపి

ఉజ్వల్‌ రమణ్ సింగ్‌.. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రేవతి రమన్‌సింగ్‌ కుమారుడు. గతంలో ఎస్పీ నుంచి పోటీ చేసిన ఉజ్వల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2007 మధ్య కాలంలో ములాయం సింగ్‌యాదవ్‌ ప్రభుత్వంలో కూడా కీలక పదవిలో కొనసాగారు. కొద్ది నెలల క్రితం ఆయన ఎస్పీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. విపక్ష ‘ఇండియా’ కూటమిలోని కాంగ్రెస్‌, ఎస్పీ సీట్లపై పొత్తు కుదుర్చుకోవడంతో హస్తం పార్టీకి కేటాయించిన అలహాబాద్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఉజ్వల్‌కు వచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు