Suresh Gopi: కేంద్ర క్యాబినెట్‌కు రాజీనామా వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సురేశ్‌ గోపి

కేంద్ర క్యాబినెట్‌లో కొనసాగే ఉద్దేశం లేదని తనపై వచ్చిన వార్తలపై భాజపా ఎంపీ సురేశ్‌ గోపి స్పందించారు. తనకు అలాంటి ఉద్దేశం లేదని.. అవన్నీ ఫేక్‌ వార్తలని క్లారిటీ ఇచ్చారు.

Published : 10 Jun 2024 17:21 IST

దిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు 71 మంది కేంద్ర మంత్రులు ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. వీరిలో 30 మందికి క్యాబినెట్‌ హోదా ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర క్యాబినెట్‌లో కొనసాగడంపై ఆసక్తి లేదంటూ తనపై వచ్చిన ఆరోపణలపై భాజపా (BJP) ఎంపీ సురేశ్‌ గోపి (Suresh Gopi) స్పందించారు. అదంతా తప్పుడు సమాచారమని కొట్టిపారేసిన ఆయన.. క్యాబినెట్‌ నుంచి వైదొలిగే ఉద్దేశం తనకు లేదని క్లారిటీ ఇచ్చారు.

ప్రధానితో సహా క్యాబినెట్‌ మంత్రిగా సురేశ్‌ గోపి ఆదివారం ప్రమాణం చేశారు. ఈనేపథ్యంలోనే తనకు కేంద్ర మంత్రి పదవిపై ఆసక్తి లేదని.. ఎంపీగా కొనసాగడమే ఇష్టమని ఆయన తెలిపినట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. తన అభిప్రాయాన్ని అధిష్ఠానానికి తెలియజేశానని.. తుది నిర్ణయం పార్టీకే వదిలేస్తున్నానని ప్రమాణ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడినట్లు ఫేక్‌ సమాచారం ప్రచారమైంది. 

తనపై వచ్చిన ఊహాగానాలు చర్చనీయాంశంగా మారడంతో సురేశ్‌ గోపి స్పందించారు. ‘‘ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలికి నేను రాజీనామా చేస్తానంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు సమాచారం ప్రచారం చేశాయి. నాకు అలాంటి ఉద్దేశం లేదు. మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధి, శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నా’’ అని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో ఓడినా.. పార్లమెంట్ సభ్యుడు కాకపోయినా.. కేంద్రమంత్రిగా

ఇదిలాఉండగా.. ఉత్తరాదిలో బలంగా ఉన్న కాషాయ పార్టీ.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో త్రిశ్శూర్‌లో గెలవడంతో కేరళలో తొలిసారి ఖాతా తెరిచింది. ఆ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటుడు సురేశ్‌ గోపి 74 వేల మెజార్టీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని