Dubai Rains: దుబాయ్‌లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు

Dubai Rains: దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి మన దౌత్య కార్యాలయం హెల్ప్‌లైన్‌ నంబర్లు విడుదల చేసింది.

Published : 18 Apr 2024 18:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE)లోని దుబాయ్‌ భారీ వర్షాల (Heavy Rains)తో అతలాకుతలం అయ్యింది. 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కుంభవృష్టి కురవడంతో అక్కడి జనజీవనం స్తంభించింది. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్‌ (Dubai) ఎయిర్‌పోర్టులో నీరు నిలిచిపోవడంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వేలాదిమంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నగరంలో చిక్కుకుపోయిన భారతీయుల కోసం అక్కడి దౌత్య కార్యాలయం (Indian Consulate) హెల్ప్‌లైన్‌ నంబర్లు విడుదల చేసింది.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌, ఉత్తర ఎమిరేట్స్‌ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారత పౌరులు సాయం కోసం +971501205172, +971569950590, +971507347676, +971585754213 నంబర్లకు ఫోన్‌ చేయాలని వెల్లడించింది. ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు యూఏఈ అధికారులతో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ప్రయాణికులు, భారత్‌లోని వారి కుటుంబసభ్యులతో మాట్లాడుకునేందుకు సదుపాయాలు కల్పించినట్లు పేర్కొంది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఈ హెల్ప్‌లైన్‌ నంబర్లు కొనసాగుతాయని తెలిపింది.

ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్‌ సీడింగ్‌ కారణమా?

వర్షాల నేపథ్యంలో దుబాయ్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం నుంచి పలు విమానాలు రద్దవగా.. కొన్నింటిని దారి మళ్లించారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. భారత్‌ నుంచి దుబాయ్‌ మధ్య పలు విమాన సర్వీసులు దేశీయ విమానయాన సంస్థలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. గురువారం పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికీ.. ప్రతికూల వాతావరణం వల్ల  విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని