Dubai Floods: ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్‌ సీడింగ్‌ కారణమా?

అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్‌ సీడింగ్‌’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి.

Updated : 17 Apr 2024 18:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తీవ్ర ఎండలు, పొడి వాతావరణంతో ఎప్పుడూ ఉక్కిరిబిక్కిరయ్యే ఎడారి దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఆకస్మిక వానలకు దుబాయ్‌లో పలు ప్రాంతాలు నీట మునిగాయి (Dubai floods). తీవ్ర గాలులు, భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. 24 గంటల వ్యవధిలోనే 142 మి.మీ. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈతరహా వర్షాలు ఎన్నడూ కురవలేదని అధికారుల అంచనా. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్‌ సీడింగ్‌’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి.

అత్యంత వేడి వాతావరణం..

భూమిపై అత్యంత వేడి, పొడి ప్రాంతంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉంటుంది. వేసవిలో ఇక్కడ గరిష్ఠంగా 50 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వార్షిక వర్షపాతం సగటున 200 మి.మీ.లోపు నమోదవుతుంది. దీంతో భూగర్భజల వనరులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు గాను కృత్రిమ వర్షాలను కురిపించే క్లౌడ్‌ సీడింగ్‌ పద్ధతిని ఇక్కడ ఎప్పటినుంచో అమలుచేస్తున్నారు. పెరుగుతోన్న జనాభాకు సరిపడా తాగునీరు అందించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈ పద్ధతే కొన్నిసార్లు ఆకస్మిక వరదలకు కారణమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఏడాదిన్నర వాన గంటల్లోనే.. ఎడారి దేశాన్ని వణికించిన మెరుపు వరద

1980ల్లోనే పరీక్షలు..

కృత్రిమ వర్షాలను కురిపించే పద్ధతిని యూఏఈ 1982 తొలినాళ్లలోనే పరీక్షించింది. అనంతరం అమెరికా, దక్షిణాఫ్రికా, నాసాకు చెందిన పరిశోధన బృందాల సాంకేతిక సహాయంతో 2000 తొలినాళ్లలోనే క్లౌడ్‌ సీడింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎమిరేట్స్‌ నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ మెటియోరాలజీ (NCM)తో కలిసి యూఏఈ రెయిన్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ ప్రోగ్రాం (UAEREP) దీన్ని చేపడుతోంది. వాతావరణ మార్పులను ఇక్కడి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. యూఏఈతోపాటు ఈ ప్రాంతంలోని సౌదీ అరేబియా, ఒమన్‌లు కూడా కృత్రిమ వర్షాల కోసం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. భారత్‌లోనూ ఈతరహా ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే.

ప్రయోజనాలతో పాటే..

సాధారణంగా ‘క్లౌడ్‌ సీడింగ్‌’ పద్ధతిలో సిల్వర్‌ అయోడైడ్‌ రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఈతరహా హానికర రసాయనాలకు దూరంగా ఉన్న యూఏఈ.. సాధారణ లవణాలనే వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం టైటానియం ఆక్సైడ్‌ పూత కలిగిన ఉప్పుతో ‘నానో మెటీరియల్‌’ను ఎన్‌సీఎం అభివృద్ధి చేసిందట. ఇలా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు యూఏఈ వినూత్న విధానాన్ని అనుసరిస్తోంది. స్థానిక అవసరాల కోసం చేపట్టే కృత్రిమ వర్షాలతో తాత్కాలికంగా ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఈ పద్ధతి వల్ల ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక ప్రాంతంలో వర్షాలను కురిపించాలంటే మరోచోట కరవుకు కారణమవుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా సహజ వనరుల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని