Electoral Bonds: ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి ముగిసిన గడువు.. ఎస్‌బీఐపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌

ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసిన నేపథ్యంలో ఎస్‌బీఐపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. 

Published : 07 Mar 2024 12:32 IST

దిల్లీ: ఎన్నికల బాండ్ల (Electoral Bonds) వివరాల సమర్పణకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)కు వ్యతిరేకంగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. గతంలో సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. ఈనేపథ్యంలో బాండ్ల వివరాలను ఎస్‌బీఐ వెల్లడించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడిందని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ (ADR) అనే ఎన్జీవో సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అయితే, ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించేందుకు జూన్‌ 30 వరకు గడువు కోరుతూ సోమవారం సుప్రీం కోర్టులో ఎస్‌బీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. దీని విచారణ మార్చి 11న జరిగే అవకాశం ఉన్నందున, దాంతోపాటే కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరపాలని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనానికి న్యాయవాది ప్రశాంత్‌ భూషన్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన వినతిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషన్‌ను మెయిల్‌ చేయాలని, అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. 

ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని గత నెలలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ జారీ చేసిన బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీ లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. వీటిని ఎన్నికల సంఘం మార్చి 13లోపు తన వెబ్‌సైట్‌లో ఉంచాలని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో బాండ్లు కొన్నవారు, వాటిని రిడీమ్‌ చేసుకున్న వారి వివరాలు మ్యాచ్‌ చేయడానికి కొంత సమయం పడుతుందని ఎస్‌బీఐ తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి జూన్ 30 వరకు గడువు కావాలని కోర్టును కోరింది.  

మరోవైపు బాండ్ల వివరాలు వెల్లడించేందుకు ఎస్‌బీఐ గడువు కోరడాన్ని ప్రతిపక్షాలతో పాటు బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం కూడా వ్యతిరేకిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం బ్యాంకులను ఉపయోగించుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం వెల్లడించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా ఎస్‌బీఐ ఎన్నికల బాండ్ల వివరాలను, ఎన్నికల కమిషన్‌కు వీలైనంత త్వరగా సమర్పించాలని డిమాండ్‌ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని