Kejriwal: ముందు అరెస్టు.. తర్వాత ఎన్నికల్లోకి.. మోదీ సర్కార్‌పై కేజ్రీవాల్‌ ఆరోపణలు

ప్రతిపక్షాలు పాలిస్తున్నా రాష్ట్రాల్లో కీలక నేతలను అరెస్టు చేసి.. అనంతరం కేంద్రంలోని భాజపా ఎన్నికల్లో పోటీ చేస్తుందని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. 

Published : 26 May 2024 20:39 IST

ఛండీగఢ్‌: దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. భాజపాపై విరుచుకుపడ్డారు.

‘‘దేశ స్వాతంత్ర్య పోరాటంలో పంజాబ్‌ పాత్ర కీలకం. ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు. ప్రస్తుతం భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నాయి. వాటిని కాపాడేందుకు పంజాబ్‌ మరోసారి ముందుకు రావాల్సిన సమయం అసన్నమైంది. మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి’’ అని కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. 

జమ్మూకశ్మీర్‌ విషయంలో మా తదుపరి లక్ష్యం అదే: అమిత్‌ షా

పథకం ప్రకారమే నన్నూ అరెస్టు చేశారు.. 

ఆప్‌ కీలక నేతల అరెస్టులను ప్రస్తావిస్తూ.. మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ఆప్‌ నేతలైన మనీశ్‌ సిసోదియా, సంజయ్‌ సింగ్‌ మరికొందరిని భాజపా అరెస్టు చేయించింది. నన్నూ పథకం ప్రకారమే అరెస్టు చేశారు. సార్వత్రిక ఎన్నికలు ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఇది జరిగింది. కేంద్రంలోని భాజపా.. ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో కీలక నేతలను కారాగారంలోకి నెట్టి ఎన్నికల బరిలోకి దిగుతోంది. వారికి ఎలాంటి పోటీ లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ.. మహారాష్ట్రలోని ఎన్సీపీని రెండుగా చీల్చారు. శివసేనను ముక్కలు చేసి.. పార్టీ గుర్తును లాక్కున్నారు. ఆ తర్వాత ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ను కటకటాల పాలు చేశారు’’ అని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని