Amit Shah: జమ్మూకశ్మీర్‌ విషయంలో మా తదుపరి లక్ష్యం అదే: అమిత్‌ షా

లోక్‌సభ ఎన్నికలు పూర్తి చేసుకున్న జమ్మూకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. అందుకు తమ ప్రణాళికలు అమలువుతున్నాయని తెలిపారు.    

Published : 26 May 2024 17:40 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా ముగియడంపై కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah) హర్షం వ్యక్తం చేశారు. అక్కడ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన మోదీ సర్కార్‌.. కశ్మీర్‌ విధానాన్ని నిరూపించుకుందని పేర్కొన్నారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమన్నారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో అమిత్‌ షా.. జమ్మూ కశ్మీర్‌ విషయంలో తదుపరి లక్ష్యాలను వెల్లడించారు.

‘‘కశ్మీర్‌ వేర్పాటువాదులు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. అత్యధిక పోలింగ్‌ శాతం నమోదైంది. ఇది పెద్ద పరిణామమని భావిస్తున్నా. ఈ ప్రాంతంలో విజయవంతంగా పోలింగ్‌ జరగడం.. మోదీ సర్కార్‌కి దక్కిన అతిపెద్ద విజయం. మా ప్రణాళిక ప్రకారం.. వెనుకబడిన తరగతులు, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన సర్వేలు జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తాం. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పిస్తాం. ఆ దిశగా కేంద్రం కృషి చేస్తోంది’’ అని షా పేర్కొన్నారు. 

ఉగ్రవాదాన్ని ఎగదోసేవారి జోక్యాన్ని సహించేది లేదు

భవిష్యత్తు ఎన్నికల్లో మా అభ్యర్థి.. 

జమ్మూకశ్మీర్‌లో 2024 సెప్టెంబరు 30లోగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీన్ని ప్రస్తావించిన అమిత్‌ షా.. అత్యున్నత న్యాయస్థానం విధించిన గడువు కంటే ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుందని హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని ఎందుకు బరిలోకి దింపలేదని అడిగిన ప్రశ్నకు స్పందించిన షా.. ‘‘ఈ ప్రాంతంలో మా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో కచ్చితంగా మా అభ్యర్థిని పోటీలోకి దింపుతాం’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని