Arvind Kejriwal: కేజ్రీవాల్‌ ఆరోగ్యం.. మెడికల్‌ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం

అరవింద్‌ కేజ్రీవాల్‌కు క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ అవసరమా?, అతనికి ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా దిల్లీ ఎయిమ్స్‌ను కోర్టు ఆదేశించింది.

Published : 22 Apr 2024 18:56 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు. టైప్‌-2 డయాబెటీస్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య సేవలపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈక్రమంలోనే తన వైద్యుడితో రోజూ వీడియో మాధ్యమంలో సంప్రదించే అవకాశాన్ని కల్పించాలని ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తాజాగా తోసిపుచ్చింది. ఆయనకు క్రమంతప్పకుండా ఇన్సులిన్‌ అవసరమా?, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అని పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా దిల్లీ ఎయిమ్స్‌ను ఆదేశించింది.

రోజూ అడుగుతున్నా.. కేజ్రీవాల్‌

అంతకుముందు తిహాడ్‌ జైలు సూపరింటెండెంట్‌కు కేజ్రీవాల్‌ లేఖ రాశారు. మధుమేహం దృష్ట్యా రోజూ ఇన్సులిన్ అడుగుతున్నట్లు స్పష్టంచేశారు. పైగా.. తన డయాబెటీస్‌ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఎయిమ్స్ డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడినప్పుడు ఇన్సులిన్ విషయాన్ని కేజ్రీవాల్ లేవనెత్తలేదని, వైద్యులు కూడా సూచించలేదని జైలు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో    ఈమేరకు స్పందించారు. జైలు అధికారులు చెప్పిందంతా అబద్ధమని, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తప్పుడు ప్రకటన విడుదల చేశారని ఆరోపించారు.

కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వాలి..ఆప్‌ కార్యకర్తల ఆందోళన

‘‘10 రోజులుగా ఇన్సులిన్‌ అడుగుతున్నాను. నన్ను చూసేందుకు వచ్చిన ప్రతీ వైద్యుడికి అధిక షుగర్ లెవల్స్ చూపించాను. అత్యధికంగా 250- 320 మధ్య నమోదవుతోంది. ఉదయం ఏమీ తినకముందు 160-200 స్థాయిలో ఉంటోంది. రోజూ ఇన్సులిన్ కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ.. అడగలేదని ఎలా అంటారు?’’ అని దిల్లీ సీఎం ప్రశ్నించారు. ఆరోగ్య కారణాల కింద బెయిల్‌ పొందేందుకే ఆయన చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటున్నారని ఈడీ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఆరోగ్య సేవలు నిరాకరించి ఆయన్ను చంపాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందని సునీత కేజ్రీవాల్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని