Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఉపశమనం!

ఓ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని భివండీ కోర్టు ఉపశమనం కల్పించింది. కోర్టులో ప్రత్యక్ష హాజరు నుంచి ఆయనకు శాశ్వత మినహాయింపు ఇచ్చింది.

Updated : 15 Apr 2023 16:42 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లో నమోదైన ఓ పరువునష్టం కేసు (Defamation Case)లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఉపశమనం లభించింది. విచారణ క్రమంలో ప్రత్యక్ష హాజరు నుంచి కోర్టు ఆయనకు శాశ్వత మినహాయింపు ఇచ్చింది. తన న్యాయవాది ద్వారా రాహుల్‌ ఈ మేరకు దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన భివండీ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లక్ష్మీకాంత్ సీ వాడికర్‌.. శాశ్వత మినహాయింపునకు రాహుల్‌ అర్హుడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జూన్‌ 3న ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నమోదు చేస్తామని తెలిపారు.

మహాత్మ గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్‌కు ముడిపెడుతూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేశారని, ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటూ.. 2014లో ఓ సంఘ్‌ కార్యకర్త భివండీ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ క్రమంలో 2018 జూన్‌లో రాహుల్‌ గాంధీ కోర్టుకు సైతం హాజరయ్యారు. అయితే, తాను దిల్లీవాసినని, పార్టీ కార్యక్రమాలకుతోడు ఎంపీగా తన నియోజకవర్గం(వయనాడ్)లో పర్యటనలు చేయాల్సి ఉంటుందని చెబుతూ.. కోర్టులో హాజరు నుంచి రాహుల్‌ గతేడాది మినహాయింపు కోరారు. బదులుగా తన న్యాయవాదిని అనుమతించాలని అభ్యర్థించారు.

ఈ క్రమంలోనే కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిందితుడి(రాహుల్‌)కి కోర్టులో హాజరు నుంచి మినహాయింపు ఉంటుంది’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ తేదీల్లో రాహుల్‌ న్యాయవాది క్రమం తప్పకుండా, సరైన సమయానికి కోర్టు ముందు హాజరు కావాలని, న్యాయస్థానం ఆదేశించినప్పుడు నిందితుడూ రావాలని షరతులు విధించింది. ఇదిలా ఉండగా.. వేరే ఓ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్‌కు ఇటీవల రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఎంపీగా అనర్హత వేటుకు గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని