రెండు టీకాలు సురక్షితమైనవే..!

స్వదేశంలో అభివృద్ది చేసిన రెండు వ్యాక్సిన్‌లు సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు వ్యాక్సిన్‌లు అత్యవసర వినియోగం కింద ఆమోదించబడ్డాయని, మరో నాలుగు వ్యాక్సిన్లు పురోగతిలో ఉన్నట్లు తెలిపింది. జైడస్‌ క్యాడిలా, స్పుత్నిక్‌-వి, బయోలాజికల్‌-ఇ, జెన్నోవా సంస్థలు కూడా తుదిదశ ప్రయోగాలను..

Updated : 12 Jan 2021 18:37 IST

స్పష్టంచేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: స్వదేశంలో అభివృద్ది చేసిన రెండు వ్యాక్సిన్‌లు సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు వ్యాక్సిన్‌లు అత్యవసర వినియోగం కింద ఆమోదించబడ్డాయని, మరో నాలుగు వ్యాక్సిన్లు పురోగతిలో ఉన్నట్లు తెలిపింది. జైడస్‌ క్యాడిలా, స్పుత్నిక్‌-వి, బయోలాజికల్‌-ఇ, జెన్నోవా సంస్థలు కూడా తుదిదశ ప్రయోగాలను కొనసాగిస్తుండగా.. మరికొద్ది రోజుల్లోనే వీటిని కూడా అత్యవసర వినియోగానికి అనుమతించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

టీకాలపై ప్రజలకు ఎటువంటి సందేహాలు లేకుండా, స్థానిక భాషల్లో విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. రెండు మోతాదుల్లో టీకాలు తీసుకున్న రెండు వారాల వరకు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. పంపిణీ సమయంలో ఇతర ఆరోగ్య కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మొత్తం ప్రక్రియ అంతా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంతో జరుగుతోందని తెలిపిది. ఈ నేపథ్యంలో ప్రజల సహకారం కావాలని కేంద్ర ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.

ఇప్పటికే సేకరించిన కరోనా వ్యాక్సిన్‌ల ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 1.1కోట్ల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను సేకరిస్తుండగా, డోసు ధర రూ.200గా ఉన్నట్లు వెల్లడించింది. ఇక భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ 55లక్షల డోసులను తీసుకుంటుండగా, వీటిలో 38.5లక్షల డోసుల్లో ప్రతి డోసుకు రూ.295 ధర చెల్లించనున్నట్లు తెలిపింది. అయితే, మరో 16.5లక్షల డోసులను భారత్‌ బయోటెక్‌ ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే డోసుకు రూ.200..

దేశంలోవ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే ఒక్కో డోసు రూ.200కు అందిస్తున్నామని అదర్‌ పూనావాలా స్పష్టంచేశారు. సీరం నుంచి వ్యాక్సిన్ల రవాణా చారిత్రత్మక ఘట్టం అని, దేశ పౌరులందరికీ వ్యాక్సిన్‌ అందివ్వడమే తమ ముందున్న సవాల్‌ అని అదర్‌ పూనావాలా అభిప్రాయపడ్డారు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కోసం చాలా దేశాలు ప్రధాని కార్యాలయాన్ని సంప్రదిస్తున్నాయని.. వీరిలో ఆఫ్రికా, దక్షిణ అమెరికాకు వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రయత్నం జరుగుతోందని అదర్‌ పూనావాలా తెలిపారు.

ఇక దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి వ్యాక్సిన్‌ సరఫరా చేసేందుకు ఏర్పాట్లన్నీ చకచక కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు టీకాలను సరఫరా చేస్తున్నారు. సీరం తయారుచేస్తోన్న కొవిషీల్డ్‌ టీకాలను దేశంలో 12నిర్దేశిత కేంద్రాలకు పుణె నుంచి ప్రత్యేక విమానాల్లో చేరవేస్తున్నారు. 3.72లక్షల కొవిషీల్డ్‌ టీకాలు హైదరాబాద్‌ చేరుకున్నాయి. తొలివిడతలో భాగంగా మూడు కోట్ల మంది ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీరికి ఉచితంగానే వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

ఇవీ చదవండి..
హెర్డ్‌ ఇమ్యూనిటీ ఈ ఏడాది అసాధ్యమే!
4కోట్ల వ్యాక్సిన్‌ డోసులు సిద్ధం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని