Cyclone Remal: బలహీన పడిన ‘రెమాల్‌’.. ఊపిరి పీల్చుకున్న బెంగాల్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్‌’ తుపాను సోమవారం ఉదయం నుంచి బలహీనపడినట్లు వాతవరణ శాఖ వెల్లడించింది.

Updated : 27 May 2024 13:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్‌’ తుపాను బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లో తీరం దాటిన తర్వాత విధ్వంసం సృష్టించింది. తీరం దాటే సమయంలో తుపాను దాటికి బెంగాల్‌ వణికిపోయింది. 135 కి.మీ వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. సాధారణ రైలు, మెట్రో రైలు సర్వీసులతోపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోల్‌కతాలో అనేక చోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సోమవారం ఉదయం నుంచి తుపాను బలహీన పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా సుమారు లక్షకుపైగా మందిని సురక్షిత ప్రాంతాలకు అధిరారులు తరలించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో తీర రాష్ట్రం ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. నిలిపివేసిన విమాన సర్వీసులు.. 21 గంటల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. పట్టాలపై నీరు నిలిచిపోవడంతో పలు మార్గాల్లో మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి.

గతంలో విధ్వంసం సృష్టించిన అంపన్‌ తుపానుతో పోలిస్తే రెమాల్‌ ప్రభావం తక్కువేనని కోల్‌కతా మేయర్‌ ఫర్హాద్‌ హకీమ్‌ వెల్లడించారు. కూలిన వృక్షాల తొలగింపు చర్యలు చేపట్టామన్నారు. సుందర్బన్‌ ప్రాంతంలోని గోసాబాలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలపాలైనట్లు సమాచారం. అటు బంగ్లాదేశ్‌ కూడా 8లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని